ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకం ఎప్పుడో?
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:10 AM
: ప్రభుత్వం గత విద్యా సంవత్సరం చివరలో సూర్యాపేట జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడానికి వీలున్న వారు డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది.
పాఠశాలలు ప్రారంభమై 20 రోజులైనా పూర్తికాని నియామకాలు
ఉపాధ్యాయులు లేకుంటే భోదన ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్న
నూతనకల్, జూలై 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం గత విద్యా సంవత్సరం చివరలో సూర్యాపేట జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడానికి వీలున్న వారు డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. నూతన్‌కల్ మండలం నుంచి మూడు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు దరఖాస్తు చేశారు. ఎర్రపహాడ్, ఎడవెల్లి, తాళ్లసింగారం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ పాఠశాలలకు ప్రీ ప్రైమరీ బోధించడానికి ఒక టీచర్, ఒక ఆయా పోస్టు మంజూరు చేసింది. గత నెలలోనే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఎంపిక చేసేందుకు జిల్లా అధికారులకు దరఖాస్తులు పంపించారు. పాఠశాలలు ప్రారంభమై 20 రోజులైనా ఇప్పటివరకు టీచర్లను నియమించలేదని, సరిపడా ఉపాధ్యాయులు లేకపోతే భోదన ఎలా చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని ఎర్రపహాడ్ ప్రీ ప్రైమరీ తరగతులకు 12 మందితో పాటు, మిగతా తరగతులకు కలిపి 108 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. ఎడవెల్లి ప్రీ ప్రైమరీ 14మందితో కలిపి మొత్తం 115, తాళ్లసింగారం ప్రీ ప్రైమరీలో ఎనిమిది మందితో కలిపి మొత్తం 60 విద్యార్థులు వస్తున్నారు. ఆయా పాఠశాలలకు వచ్చే నూతన విద్యార్థులు మొత్తం ప్రైవేట్ పాఠశాలలనుంచి వచ్చే వారే ఉన్నారు. సరైన భోదనా సిబ్బంది లేకపోతే వచ్చిన పిల్లలు వెళ్లి పోతారేమోనని హెచ్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్లకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేలు ప్రభుత్వం చెల్లించనుంది. వీరికి 10 నెలల వేతనం చెల్లిస్తారు. కలెక్టర్ స్పందించి నియామకాలు పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈవో రాములునాయక్‌ను వివరణ కోరగా మండలంలో మూడు గ్రామాల పాఠశాలల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా అధికారులకు పింపిచామని, ఉత్తర్వులు రాగానే ఎంపికైనఙ వారికి నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు.