Share News

urea?: యూరియా ఏదయా?

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:45 AM

యాసంగి సీజన్‌లో వరినాట్లు ముమ్మరవుతున్న దశలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. ఫెర్టిలైజర్‌ బుకింగ్‌యా్‌పలో బుక్‌ చేస్తే తప్ప యూరియా తీసుకునే వెసులుబాటు లేకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. పీఏసీఎ్‌సలు, మన గ్రోమోర్‌ కేంద్రాల్లో మాత్రమే యూరియా అందుబాటులో ఉంటుండడంతో రైతులకు సమృద్ధిగా లభించడం లేదు.

urea?: యూరియా ఏదయా?

యాప్‌ బుకింగ్‌తో రైతుల అవస్థలు

నాట్ల సీజన్‌లో యూరియా కొరతతో అన్నదాతల ఇక్కట్లు

అమ్మకాలు తగ్గించేసిన ప్రైవేట్‌ డీలర్లు

20,113 బస్తాల యూరి యా నిల్వలు ఉన్నట్లు యాప్‌లో సమాచారం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): యాసంగి సీజన్‌లో వరినాట్లు ముమ్మరవుతున్న దశలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. ఫెర్టిలైజర్‌ బుకింగ్‌యా్‌పలో బుక్‌ చేస్తే తప్ప యూరియా తీసుకునే వెసులుబాటు లేకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. పీఏసీఎ్‌సలు, మన గ్రోమోర్‌ కేంద్రాల్లో మాత్రమే యూరియా అందుబాటులో ఉంటుండడంతో రైతులకు సమృద్ధిగా లభించడం లేదు. ప్రైవేట్‌ డీలర్లు యూరియా విక్రయించడం లేదు. యాప్‌లో రైతులు నమోదు చేసే సమయంలో యూరియా నిల్వలను చూపకపోవడం, సొంత మండలాల్లోని ఏజెన్సీల్లో యూరియా నిల్వ లేకపోతే, సుదూర ప్రాంతాల్లోని ఏజెన్సీల్లో నిల్వలున్నట్లు చూపుతుండడంతో రైతులు యూరియా తెచ్చుకోలేని దుస్థితి నెలకొంది.

యూరియా వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, బ్లాక్‌ మార్కెట్‌ను నిరోధించడం, అవసరమైన మేరకే ఎరువుల వినియోగం ఉండేలా చూడాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ అమలులో జిల్లాలో పలు ఇబ్బందులు తెరపైకి వస్తున్నాయి. యాప్‌ అమలులోకి వచ్చాక ప్రైవేట్‌ డీలర్లు యూ రియా విక్రయాలను తగ్గించేశారు. పీఏసీఎ్‌సలు, గ్రోమోర్‌ ఏజెన్సీల్లోనే యూరియా నిల్వలు ఉంటున్నా యి. రైతులు యాప్‌లో యూరియా బుకింగ్‌ చేసేటప్పుడు ఈ ఏజెన్సీల్లో నిల్వలుంటేనే బుక్‌ అవుతుంది. యాప్‌లో సుదూర ప్రాంతాల్లోని ఏజెన్సీల వద్ద నిల్వలు ఉన్నట్టు లేదా జీరో స్టాక్‌ ఉన్నట్టు చూపడం, తదితర కారణాలతో రైతులకు యూరియా దొరకడం లేదు. ఒకటి, రెండు బస్తాల యూరియా కోసం రైతు లు సుదూరంగా ఉండే ఏజెన్సీల వద్దకు వెళ్లి తెచ్చుకోవడం ఇబ్బందిగా మారింది.యాప్‌ అమలులోకి వచ్చా క ప్రైవేట్‌ డీలర్ల వద్ద యూరియా నిల్వలు ఉంచడం లేదు. పట్టాదారులైతే తప్ప యాప్‌లో నమోదవడం లేదు. కౌలు రైతులకు యూరియా యాప్‌లో భూయజమానుల పేరుతోనే బుక్‌ చే స్తే తప్ప రావడం లేదు.

యూరియా విక్రయాలు తగ్గించేసిన ప్రైవేట్‌ డీలర్లు

ప్రైవేట్‌ డీలర్లు యాప్‌లో బుక్‌ చేసుకున్న రైతులకే యూరియా ఇవ్వాలి. ఎమ్మార్పీకే విక్రయించాల్సి ఉండ డం వంటి కారణాలతో డీలర్లు యూరియాను విక్రయించడం లేదని తెలుస్తోంది. ఎమ్మార్పీ రూ.266 ఉండగా, ప్రైవేట్‌ డీలర్లకు రూ.30 వరకు అదనంగా రవాణా, హమాలీ ఖర్చులు పడుతున్నాయి. వీటిని డీలర్లే భరించాల్సి రా వడం, ప్రైవేట్‌ డీలర్లు ఖాతాదారులకు మాత్రమే గాక యాప్‌ ద్వారా బుక్‌చేసుకునే రైతులకు ఎమ్మార్పీకి విక్రయించాల్సి రావడంతో లాభాలు లేకపోగా, నష్టపోవాల్సి వస్తోందని, అదనపు ధర అడిగితే రైతులు ఆందోళనలకు దిగితే కేసుల పాలవ్వాల్సి వస్తోందనే కారణాలతో ప్రైవేట్‌ డీలర్లు యూరియా విక్రయాలను పూర్తిగా తగ్గించేశారు. దీంతో రైతులకు యూరియా అందుబాటులో ఉండటం లేదు.

నాట్ల సీజన్‌ కావడంతో రైతుల ఇక్కట్లు

జిల్లాలో యాసంగి సీజన్‌లో నాగార్జునసాగర్‌, ఏఎమ్మార్పీ ఆయకట్టుతో పాటు, నాన్‌ ఆయకట్టులో బోరుబావుల కింద యాసంగి వరి సాగు ఇప్పటికే మొదలయింది. నాట్లు ప్రారంభమవడంతో రైతులు యూరియా, కాంప్లెక్స్‌ ఎరువుల కోసం వెదుకులాడుతున్న పరిస్థితి నెలకొంది. నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన రైతు రెండు బస్తాల యూరియా కోసం సోమవారం యాప్‌లో బుక్‌చేస్తే కేతేపల్లిలో నిల్వలున్నాయని, అక్కడ ఒక బస్తా ఉందని సమాచారం వచ్చింది. ఒక్క బస్తా కోసం కేతేపల్లి ఎలా వెళ్లాలని సదరు రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. మునుగోడు మండలం కొంపల్లికి చెందిన ఒక రైతు ఐదు బస్తాల యూరియా కోసం యాప్‌లో బుక్‌చేయగా, ఆయనకు మిర్యాలగూడలో నిల్వ చూపించింది. అక్కడికి వెళ్లాలంటే రవాణా ఖర్చులు, పైగా రోజంతా వెచ్చించాల్సి వస్తోందని రైతు వాపోయాడు. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు కేతావత్‌ శ్రీనునాయక్‌ మూడు బస్తాల యూరియా కోసం మూడు రోజులుగా స్మార్ట్‌ ఫోన్‌లో బుకింగ్‌ కోసం చూస్తుండగా, కొండమల్లేపల్లి, మిర్యాలగూడల్లో నిల్వ చూపిస్తోంది. అడవిదేవులపల్లి, లేకపోతే దామరచర్లల్లో యూరియా ఇస్తే సౌలభ్యంగా ఉంటుందని సదరు రైతు వాపోయాడు. యూరియా బుక్‌ చేసుకోవాలనుకునే స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకొని రోజంతా యాప్‌ను చూస్తూ కూర్చోవాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. చదువురాని, స్మార్ట్‌ ఫోన్లు లేని రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

20,113 బస్తాల యూరియా నిల్వలు

ఓ వైపు క్షేత్రస్థాయిలో యూరియా కోసం అవస్థపడుతున్నామని, స్థానికంగా యూరియా అందుబాటులో లేదని రైతులు గగ్గోలు పెడుతుంటే, మరోవైపు యాప్‌లో మాత్రం జిల్లాలో సోమవారం సాయంత్రం కూడా 20,113 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నట్లు సూచిస్తోంది. అయితే మనగ్రోమోర్‌, పీఏసీఎస్‌ ఏజెన్సీల ద్వారానే యూరియా విక్రయాలు సాగుతుండడంతో రైతులకు కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా రైతులు వారికి అందుబాటులో ఉండే డీలర్ల వద్ద, పీఏసీఎస్‌ ఏజెన్సీలు, గ్రోమోర్‌ ఏజెన్సీల వద్దనే యూరియాను కొనుగోలు చేస్తారు. ఎక్కువ భాగం ప్రైవేట్‌ డీల్లరనే ఆశ్రయిస్తుండడంతో, ఈసారి వారి వద్ద యూరియాలేక కొరత కనిపిస్తోంది. బుకింగ్‌లోనూ పలు లోపాలుండడం, రైతులకు అవసరమైన చోట యూరియా అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్నప్పటికీ రైతులకు అందుబాటులో లేని పరిస్థితి కొనసాగుతోంది. దీన్ని నివారించేందుకు ప్రతీ మండలంలో కనీసం ఒక ఏజెన్సీ వద్ద ప్రతీ రోజు యూరియా అందుబాటులో ఉండేలా, యాప్‌లోనూ బుకింగ్‌ సమయంలో ఆ సమాచారం పొందుపరిచేలా వ్యవసాయాధికారులు చూడాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏ ఏజెన్సీలో నిల్వ ఉంటే, ఆ ఏజెన్సీకి రైతు వెళ్లాలనే నిబంధన తొలగించి, ప్రతి మండలంలో కనీసం ఒక ఏజెన్సీలో యూరియాను నిత్యం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

ఇప్పటివరకు 40వేల మెట్రిక్‌టన్నుల యూరియా విక్రయాలు

జిల్లాలో యాసంగి సీజన్‌లో 5.40లక్షల ఎకరాల్లో వరి, ఇతర మెట్టపంటలు సాగవుతాయని అంచనాయవేయగా, ఇప్పటివరకు 2.60లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి 2లక్షల ఎకరాలకు పైగా సాగైంది. ఈసీజన్‌కు 75వేల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరమని అంచనా వేశారు. అందులో ఇప్పటివంరకు 40,200 మెట్రిక్‌ టన్నుల యూరియా రైతులకు అందించారు. ఇంకా 9వేల మెట్రిక్‌టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.

యూరియా కొరత లేదు

జిల్లాలో యూరియా కొరత లేదు. ఇప్పటివరకు ఈసీజన్‌లో 40వేల మెట్రి క్‌ టన్నుల యూరియా రైతులకు అందించాం. ప్రస్తుతం 9వేల మెట్రిక్‌టన్ను ల యూరియా అందుబాటులో ఉంది. యాప్‌ ద్వారా బుకింగ్‌తో సులభతరమైంది. యాప్‌ను కొత్తగా అమలులోకి తేవడంతో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వీటిని సరిచేసేందుకు క్షేత్రస్థాయి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. డీలర్లకు కూడా యూరియా కేటాయింపులు చేస్తున్నాం.

- పి.శ్రవణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖాఽధికారి

Updated Date - Jan 13 , 2026 | 12:45 AM