Share News

kumaram bheem asifabad- వేతన పెంపు ఏది?

ABN , Publish Date - Feb 14 , 2026 | 10:04 PM

వేతనాలు పెరుగుతాయని గంపెడు ఆశలతో ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా వేతనాల పెంపు శుభవార్త లేనేలేదు. ఎన్నికలకు ముందు వేతనాలు పెంచుతామని మాట ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అటకెక్కించింది

kumaram bheem asifabad- వేతన పెంపు ఏది?
పాపన్‌పేట అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారులు

- రెండేళ్లు గడిచినా స్పందించని ప్రభుత్వం

బెజ్జూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): వేతనాలు పెరుగుతాయని గంపెడు ఆశలతో ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా వేతనాల పెంపు శుభవార్త లేనేలేదు. ఎన్నికలకు ముందు వేతనాలు పెంచుతామని మాట ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అటకెక్కించింది. వేతనాలు పెరుగుతాయన్న గంపెడు ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని టీచర్లు, హెల్పర్లు ఆవే దనకు లోనవుతున్నారు. వేలనాలు పెంచాలనే విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే అసంతృప్తులు పెల్లుబికుతున్నాయి.

- అమలుకు నోచుకోని హామీ..

టీచర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచుతామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ కలగానే మిగి లింది. ప్రస్తుతం టీచర్లకు నెలకు రూ.13,600గౌరవ వేతనం లభిస్తోంది. హెల్పర్లకు రూ.8,500గౌరవ వేతనంగా అందుతోంది. ఈ లెక్కన కనీస రోజు కూలీ స్థాయి మేరకు కూడా నెల మొత్తంగా వేతనం లభించడం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు అనేక రూపాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. గత ఎన్నికల సమయంలో ఈ అంఽశంపై కాంగ్రెస్‌ హామీ గుప్పించింది. అఽధికారంలోకి వస్తే అంగన్‌వాడీల గౌరవ వేతనం రూ.26వేలకు పెంచుతామని ప్రకటించింది. అదే విధంగా హెల్పర్ల వేతనం కూడా పెంచుతామని స్పష్టం చేసింది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేరలేదు. దీనిపై టీచర్లు, హెల్పర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని దీంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 1,006అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 841మంది టీచర్లు పని చేస్తున్నారు. హెల్పర్లు 559మంది పని చేస్తుండగా, 165అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, 447హెల్పర్లు ఖాళీగా ఉన్నాయి.

- అందని ఆర్థిక ప్రయోజనాలు..

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లకు, హెల్పర్లకు ఉద్యోగ విరమణ ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 65ఏళ్లు వయసు నిండిన టీచర్లు, హెల్పర్లు ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు లక్ష రూపాయలు రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే జిల్లాలో 31-04-2025వరకు టీచర్లు 39, హెల్పర్లు 143మంది రిటైర్మెంట్‌ అయ్యారు. ఇప్పటి వరకు రిటైర్మెంట్‌ అయిన వారికి ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా మంజూరు కాలేదు. దీంతో వారికి రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్స్‌ అందక అనేక అవస్థలు పడుతున్నారు.

- అదనపు భారంతో సతమతం..

అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెంచకపోవడమే కాకుండా వారిపై ప్రభుత్వం అదనపు విధుల భారాన్ని మోపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారాలు, సర్వేలు, ఇలా ప్రతిదానికి అంగన్‌వాడీ టీచర్లు విధులు నిర్వహించాల్సి వస్తోంది. లబ్దిదారుల ఎంపిక, పథకాల ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సర్వేలతో ఇంటింటికి తిరుగుతూ సమాచారాన్ని నమోదు చేయా ల్సి వస్తోంది. ఇచ్చే అరకొర వేతనంతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని వాపోతున్నారు. కాగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కరువైంది. ఎంతో కాలంగా ప్రభుత్వ గుర్తింపు కోసం డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అరకొరగా ఇచ్చే వేతనాలతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా గుర్తింపునకు నోచుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.

- పింఛన్‌కు నోచుకోని వైనం..

రిటైర్మెంట్‌ తర్వాత టీచర్లు, హెల్పర్లకు ఎలాంటి పింఛన్‌ లేదు. పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని అంగన్‌వాడీలు వాపోతున్నా రు. ప్రభుత్వ ఉద్యోగులుగా వీరికి ఎలాంటి గుర్తింపు లేదు. టీచర్లు, హెల్పర్లుగా ప్రభుత్వ భాగస్వాములుగా పని చేస్తున్నారనే కారణంతో వీరు సంక్షేమ పథకాలకు కూడా అన ర్హులుగానే ఉన్నారు. ఫలితంగా అన్ని విధాల నష్టపోతున్నారు. రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగ పింఛన్‌ అందక తీవ్రంగా నష్టపోతున్నారు. టీచర్లకు, హెల్పర్లకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర రకాల బెన్‌ఫిట్స్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వేతనం రూ.26 వేలకు పెంచాలి..

- విమల, అంగన్‌వాడీ టీచర్‌, పాపన్‌పేట

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం వేతనాన్ని రూ.26వేలకు పెంచాలి. చాలీ చాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. రిటైర్మెంట్‌ అయిన వారికి టీచర్లకు రూ.5వేలు. హెల్పర్లకు రూ.3వేలు పింఛన్‌ సౌకర్యం కల్పించాలి. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కూడా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.

Updated Date - Feb 14 , 2026 | 10:04 PM