Share News

BRS MLC Naveen Rao: ట్యాపింగ్‌లో కేటీఆర్‌ పాత్ర ఏంటి?

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:39 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌రావును ఆదివారం సిట్‌ అధికారులు రెండోసారి ప్రశ్నించారు.

BRS MLC Naveen Rao: ట్యాపింగ్‌లో కేటీఆర్‌ పాత్ర ఏంటి?

  • శ్రవణ్‌రావు, రవిపాల్‌తో ఏం సంబంధం

  • ఎమ్మెల్సీ నవీన్‌రావుకు సిట్‌ ప్రశ్నలు

  • ట్యాపింగ్‌ బాధితులపై కొత్త సిట్‌ దృష్టి

  • వారిని మళ్లీ విచారించేందుకు సన్నద్ధం

హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌రావును ఆదివారం సిట్‌ అధికారులు రెండోసారి ప్రశ్నించారు. దాదాపు 9 గంటల పాటు పలు అంశాలకు సంబంధించి విచారణ చేశారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ పాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. రాజకీయ సంబంధాలపై తనను ప్రశ్నలు అడిగారన్న విషయాన్ని నవీన్‌రావు విచారణ తర్వాత మీడియా ముందు చెప్పారు. తనను 2024 సెప్టెంబరులో విచారణకు పిలిస్తే వెళ్లానని, అప్పట్లో మూడు గంటలు విచారించారని, ఇప్పుడు కూడా అవే ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. ట్యాపింగ్‌ పరికరాల కొనుగోలు గురించి తనను ప్రశ్నించలేదని చెప్పారు. రాజకీయ నేతలు, కొందరు వ్యక్తులతో సంబంధాల గురించి అడిగారని.. అన్నింటికీ సమాధానం చెప్పానని, మళ్లీ విచారణకు రావాలని పిలవలేదని పేర్కొన్నారు. కాగా, ప్రభాకర్‌ రావు బృందం చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఒక ఎత్తయితే శ్రవణ్‌రావు, ప్రణీత్‌రావు, నవీన్‌రావులు కలిసి ఒక మాజీ మంత్రి కోసం చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ మరో ఎత్తని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ట్యాపింగ్‌ కేసులో నిందితుడు, మీడియా ఛానల్‌ అధినేత శ్రవణ్‌రావును ఎస్‌ఐబీ బృందానికి పరిచయం చేసింది నవీన్‌రావు అని అనుమానిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ కోణాన్ని ఆవిష్కరించడంలో నవీన్‌రావు పాత్ర కీలకమని భావిస్తున్నారని తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ రెండు దశల్లో జరిగిందని, అందులో ఎస్‌ఐబీ కార్యాలయం నుంచి కొంత కాగా.. మరికొంత శ్రవణ్‌రావు ఇల్లు, ఆఫీసు నుంచి జరిగినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అప్పట్లో సంధ్య కన్వెన్షన్‌ యజమాని శ్రీధర్‌రావుపై కేసులు నమోదు చేయించడం వెనుక నవీన్‌రావు పాత్ర ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీధర్‌రావుకు సంబంధించిన ఫోన్‌ సంభాషణలను ట్యాప్‌ చేసి, ఆయన్ను బెదిరింపులకు గురిచేశారని, అందులో నాటి మంత్రికి సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఇప్పటికే సిట్‌ అధికారులు విచారణ జరిపారు. శ్రవణ్‌రావు ఇంట్లో ఏర్పాటు చేసిన ట్యాపింగ్‌ యూనిట్‌కు సంబంధించిన సాంకేతిక పరికరాలను గతంలో ఎస్‌ఐబీకి టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్‌ ద్వారా తెప్పించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రవిపాల్‌, నవీన్‌రావు, శ్రవణ్‌రావుల సంబంధాలపై సిట్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతి రెడ్డిల ఫోన్ల సంభాషణల ట్యాపింగ్‌, ఆ ఆడియోలను కీలక వ్యక్తులకు చేరవేయడంలో నవీన్‌రావు పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.


మరికొందరికి నోటీసులకు సన్నద్ధం..

2023 నవంబరులో 618 ఫోన్‌ నంబర్లకు సంబంధించిన సమాచారం కావాలంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఎస్‌ఐబీ నుంచి లేఖ వెళ్లింది. అందులో ఉన్న పేర్ల ఆధారంగా పాత సిట్‌ దర్యాప్తు జరపగా, కొత్తగా వచ్చిన సిట్‌ బృందం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, శ్రీధర్‌రావు వ్యవహారంతో పాటు ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపణలు చేసిన వారందరినీ మరోసారి విచారించి బాధ్యులకు నోటీసులు ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా బీఆర్‌ఎ్‌సలోని కొందరు పెద్దలను విచారణకు పిలవాలని సిట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగిన విచారణలో సిట్‌ అధికారులు విజయ్‌కుమార్‌, రవీందర్‌ రెడ్డి, వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 03:39 AM