kumaram bheem asifabad- చేయూత పింఛన్ పెంపు ఊసేదీ..?
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:26 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి మూడేళ్లు కావ స్తున్నా చేయూత పింఛన్ల పెంపుపై ఊసేత్తడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2016 పెన్షన్ ఇవ్వగా, తాము అధికారంలోకి వస్తే చేయూత పెన్షన్లు రెండింతలు చేస్తామని, కుటుంబంలో ఇద్దరికి సమానంగా పింఛన్ ఇస్తామని 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కాని ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్న హామీ అమలు కావడం లేదని పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
- హామీ అమలు చేయాలని వినతి
ఆసిఫాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి మూడేళ్లు కావ స్తున్నా చేయూత పింఛన్ల పెంపుపై ఊసేత్తడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2016 పెన్షన్ ఇవ్వగా, తాము అధికారంలోకి వస్తే చేయూత పెన్షన్లు రెండింతలు చేస్తామని, కుటుంబంలో ఇద్దరికి సమానంగా పింఛన్ ఇస్తామని 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కాని ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్న హామీ అమలు కావడం లేదని పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న పింఛన్ తమ అవసరాలకు ఉపయోగపడుతున్నప్పటికీ ప్రస్తుతం నిత్యవసరాల ధరలు భారీగా పెరుగడంతో ప్రభుత్వం పింఛన్ డబ్బులు ఏ మాత్రం సరి పోవడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం పింఛన్ పెంపు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
- ఆరు గ్యారంటీల్లో భాగంగా..
అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీ అమల్లో నిమగ్నమైన ప్రభుత్వం పింఛన్ పెంపు విషయం మరిచి పోయిందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం తమ పింఛన్ పెంచుతుందని ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నామని చెబుతు న్నారు.. వృద్ధులకిచ్చే పింఛన్ రూ.2016 నుంచి రూ.4016కు, దివ్యాంగుల పింఛన్ రూ.4016 నుంచి రూ.6016కు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. ఆ హామీ ప్రకారం చేయూత పింఛన్లను పెంచి ఆదుకోవాలని లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. కాగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 56,225 మంది పింఛన్‌దారులున్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్ దారులు 24,235, దివ్యాంగులు 5,974, వితంతువులు 22,095 మంది ఉన్నారు. చేనేత పింఛన్‌దారులు 489, గీత కార్మికులు 139, బీడీ కార్మికులు 86, ఒంటరి మహిళలు 2,605, ఫైలేరియా బాదితులు 567, డయాలసిస్ బాధితులు 35 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెల 13కోట్లపై చిలుకు రూపాయిలను చేయూత పెన్షన్ల ద్వారా అందజేస్తున్నారు.
పింఛన్లు పెంచాలి..
- ఇస్లాంబీన్ హసన్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం పించన్లు పెంచాలి.. నిత్యవసర ధరలు వీపరితంగా పెరిగాయి. గత ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరా పెన్షన్ కింద రూ.4016 ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు ఇచ్చే పింఛన్ రూ.2016 నుంచి రూ.4016, దివ్యాంగుల పింఛన్ రూ.4016 నుంచి రూ6016 ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చి న హామీ ప్రకారం చేయూత పెన్షన్లు పెంచి లబ్దిదారులను ఆదుకోవాలి.