జనరిక్ మందుల ఊసేది..!
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:41 PM
ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు విధిగా రోగులకు జనరిక్ మందులను రాయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు జిల్లాలో బుట్ట దాఖలవుతున్నాయి.
-సుప్రీం కోర్టు ఆదేశాలు భేఖాతర్
-పెడచెవిన పెడుతున్న ప్రైవేటు వైద్యులు
-ప్రైవేటు ఫార్మసీల్లో రోగుల జేబులకు చిల్లులు
మంచిర్యాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు విధిగా రోగులకు జనరిక్ మందులను రాయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు జిల్లాలో బుట్ట దాఖలవుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ జనరిక్ మం దుల ఊసే ఎత్తడంలేదు. మెడికల్ షాపుల్లో బ్రాండ్ పేరిట ఎక్కువ ధరలకు మందులను అమ్ముతుండగా ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జన ఔషది పేరిట జనరిక్ మందులు అందుబాటులో ఉన్నా అవి నాసిరకమని, పెద్దగా ఫలితం ఉండదని కొందరు వైద్యు లే చెబుతున్నట్లు సమాచారం. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రైవేటు వైద్యులను మశ్చిక చేసుకోవడం ద్వారా తమ కంపెనీలకు చెందిన అధిక ధరలుగల మందులను రాసేలా ఉసిగొల్పుతున్నారు. ఈ క్రమంలో మందుల కొనుగోళ్లపై 40 శాతం మేర సదరు వైద్యులకు కమీషన్ల పేరిట నగదు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ధరల్లో భారీ వ్యత్యాసం....
బ్రాండెడ్ మందులతో పోల్చితే జనరిక్ మందుల ధర అతి స్వల్పంగా ఉంటుంది. వివిధ రోగాలకు సం బంధించిన ఫార్ములా ఒక్కటే అయినా బ్రాండెడ్ మం దుల ధరలు 60 నుంచి 70 శాతం మేర ఎక్కువగా ఉంటుంది. అలర్జీ కోసం ఉపయోగించే సిట్రిజన్ ఫా ర్ములా కలిగిన ఒకాసెట్ ట్యాబ్లెట్ల షీట్ (10 గోళీలకు) బ్రాండెడ్లో రూ. 30కి అమ్ముతుండగా జనరిక్ దుకాణంలో కేవలం రూ. 6కు విక్రయిస్తున్నారు. అలాగే విటమిన్ డి-3 కూడిన క్యాల్షియం ట్యాబ్లెట్లు (15 గోళీలకు) మార్కెట్లో బ్రాండెడ్ రూ. 115కి విక్రయిస్తుండగా జనరిక్ మందుల దుకాణంలో రూ. 25కు అమ్ముతున్నారు. నడుముకు వేసుకొనే బెల్టు రాయల్ కంపెనీకి చెందినది జనరిక్ షాపులో రూ. 280కి లభిస్తుండగా అదే కంపెనీకి చెందిన బెల్టు బ్రాండెడ్లో రూ. 900కి విక్రయిస్తున్నారు. ఇలా బ్రాండెడ్ పేరుతో కంపెనీలు ప్రజల నెత్తిన అధిక ధరలను మోపుతున్నారు.
కోడ్ భాషలో ప్రిస్ర్కిప్షన్....
నేటి రోజుల్లో అన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రు ల్లో అనుసంధానంగా మెడికల్ షాపులు ఉంటున్నా యి. వైద్యశాలలో పరీక్షలు చేయించుకున్న తర్వాత అదే ఆసుపత్రిలోగల మెడికల్ షాపులోనే మందులు కొనా ల్సి వస్తుంది. డాక్టరు రాసిన చీటీతో బయట మందు లు కొనే పరిస్థితిలేదు. దీనికి కారణం సదరు వైద్యులు ప్రిస్ర్కిప్షన్లో రాసే భాషనే. కొందరు వైద్యులు గొ లు సు రాతతో అర్థం కాకుండా మందులు రాస్తే....మరికొందరు కోడ్ భాష ఉపయోగిస్తూ ప్రిస్ర్కిప్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైద్యులు వాడే భాష ఆ ఆసుపత్రికి అను బంధంగా ఉన్న మెడికల్ షాపు నిర్వాహకులకు మాత్ర మే అర్థం అవుతుంది. అలా రోగులు అక్కడే మందులు కొనక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యులు రోగులను పరీక్షించాక మందులు రాసేటప్పు డు ఆంగ్ల ఆక్షరాలను విడివిడిగా, పెద్ద అక్షరాలు (క్యాపిటల్ లెటర్స్)ను ఉపయోగించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ ఇక్కడ అమలు కావడంలేదు. ఇక ప్రభుత్వ వైద్యులు మందుల చీటీలో జనరిక్ మం దుల పేర్లు రాయాల్సి ఉండగా ల్యాబోరేటరీ(కంపెనీ)ల పేర్లు రాస్తుండటంతో అవి జనరిక్ స్టోర్లో లభించక ప్రైవేటు మెడికల్ స్టోర్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ రకంగా ప్రభుత్వ వైద్యులు కూడా జనరిక్ మందులకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడంలేదు.
అమ్మకాలు లేవు...
జనరిక్ మందుల షాపు నిర్వాహకుడు రమేష్
మంచిర్యాల జిల్లా కేంధ్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో జీవన్దార జనరిక్ మందుల దుకాణం నిర్వహిస్తున్నాను. వైద్యులు రాసే చీటిలో కంపెనీల పేర్లు రాస్తుండటంతో మా వద్ద అందుబాటులో లేక రోగులను వెనక్కి పంపిచాల్సి వస్తోంది. అలా కాకుండా ఫార్ములా రాస్తే దాదాపు అన్ని మందులు అతి తక్కువ ధరల్లో మా వద్ద అందుబాటులో ఉంటాయి. వికలాంగుల కోటా కింద నాకు షాపు కేటాయించగా రూ. 4 లక్షలు పెట్టుబడి పెట్టాను. వైద్యులు ప్రోత్సహిస్తే అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.