Share News

kumaram bheem asifabad-వామ్మో చలి

ABN , Publish Date - Jan 11 , 2026 | 10:06 PM

ఆసిఫాబాద్‌ ఏజెన్సీ చలి గుప్పిట్లో చిక్కి గజ గజ వణుకుతోంది. రెండు మూడేళ్లలో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది ఒక్క సారిగా వాతావరణం మారి పోవడంతో ఎజెన్సీ ప్రాంతంలో ప్రజలు చలితో యుద్ధం చేస్తున్నారు. ఉదయం తొమ్మిది, తొమ్మిదిన్నర గంటలైనా బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది.

kumaram bheem asifabad-వామ్మో చలి
:ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున కమ్మెసిన పొగమంచు(పైల్‌)

- దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

- సిర్పూర్‌(యు), తిర్యాణి మండలాలల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

- ఈ ఏడాది 4.8 డిగ్రీలకు పడి పోవడంతో అవస్థలు

- వృద్ధులు, చిన్న పిల్లల ఆరోగ్యంపైనే తీవ్ర ప్రభావం

ఆసిఫాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ ఏజెన్సీ చలి గుప్పిట్లో చిక్కి గజ గజ వణుకుతోంది. రెండు మూడేళ్లలో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది ఒక్క సారిగా వాతావరణం మారి పోవడంతో ఎజెన్సీ ప్రాంతంలో ప్రజలు చలితో యుద్ధం చేస్తున్నారు. ఉదయం తొమ్మిది, తొమ్మిదిన్నర గంటలైనా బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన సిర్పూర్‌(యు), కెరమెరి, జైనూర్‌, లింగాపూర్‌, తిర్యాణి, వాంకిడి, ఆసిఫాబాద్‌ మండలాల్లో చలి విశ్వరూపం చూపుతోంది. ఈ ఏడాది సిర్పూర్‌(యు) మండలంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకులో అత్యల్పంగా సిర్పూర్‌(యు)లో 7.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆదివాసీలు రోజు వారి పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. శీతల గాలుల తీవ్రత వల్ల జలుబు, దగ్గు వంటి సీజన్‌ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఇటు ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి.. ఈ పరిస్థితి రాబోయె రోజుల్లో తీవ్రతరం కావచ్చని వాతావరణ శాఖ నుంచి వార్తలొస్తుండడంతో చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు ప్రజలు నెగళ్లతో ఉపశమనం పొందుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చలిగాలులు వీస్తుండడం తో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా మధ్యాహ్నం తరువాతే రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

- మారుమూల గ్రామాల్లో..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న మారు మూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతులు, రైతులు కూలీలు రోజు వారి పనులు చేసుకునేందుకు కూడా బయటకు రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉదయం పొగ మంచు కూడా విఫరీతం కురుస్తుడడంతో చర్మ సంబంధ వ్యాధుల బారిన పడి చికాకులు ఎదు ర్కొంటున్నారు. ఉదయం వేళల్లో పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలకు గాలిలో తేమ కారణంగా శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నట్లు వైద్యుల మాటల్ని బట్టి అర్థమవుతున్నది. ముఖ్యంగా పత్తి తీసే సీజన్‌ కావడంతో రైతు కూలీలు పనులకు వెళ్లాలంటేనే భడపడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. సాధారణంగా కూలీలు వ్యవసాయ క్షేత్రాలకు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి సాయంతం ఐదు గంటల వరకు పని చేయడం రివాజు. తాజా పరిస్థితులతో పది, పదిన్నర గంటలు దాటితే తప్ప కూలీలు చేలకు రాక పోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఉదయం, రాత్రి వేళల్లో దూర ప్రాంతాలకు వెళ్లె ప్రయాణికులు కూడా చలిదెబ్బకు తమ ప్రయాణాలను పగటి వేళలకు మార్చుకుంటున్నారు. ఉదయం తొమ్మిది, పది గంటలు దాటితే తప్పా కూరగాయల మార్కెట్‌లలో జనం కనిపించడం లేదు. దాంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మా ర్పుల కారణంగా వృద్దులు, చిన్న పిల్లల ఆరోగ్యంపైనే తీవ్ర ప్రభావం పడే అవకాశాలు న్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- పాఠశాలల పనివేళల్లో మార్పు..

జిల్లాలో నెలకొన్న చలి వాతావరణం కారణంగా విద్యార్థుల భద్రత, శ్రేయస్సులను దృష్టిలో ఉంచు కొని గత నెల 24 నుంచి జిల్లాలోని అన్ని గురు కులాలు, పాఠశాలల పని వేళలలో మార్పు చేశారు అధికారు లు .ఉదయం 9 గంటల నుంచి సాయం త్రం 4:15 వరకు ఉన్న సమయాన్ని ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మార్చడం జరిగింది.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సవరిం చిన పాఠశాలల పని వేళలను ఆమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటే ష్‌ దోత్రే సంబందిత అధికారులను ఆదేశించడం జరిగింది.

- వ్యాధులతో సతమతం..

వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇస్నోఫిలియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. . చలితీవ్రత అధికంగా ఉన్న సమయంలో సరైన రక్షణ లేకుండా చలిగాలిలో తిరిగే వారిలోనే ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పడిపోయి తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల ఇస్నోఫిలియా ప్రభావం పెరుగుతుందని ఫలితంగా దీని భారిన పడిన బాధితులు దగ్గు, జల్బు వంటి అలర్జీలతో పాటు ఒంటిపై దురద, దద్దుర్లు రావడం వంటి సమస్యలకు గురవుతారు. ఏ మాత్రం అశ్రద్ద చేసినా రక్తంలో తేడా వల్ల వ్యాధి ముదిరి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న కొద్ది 0-5 చిన్నారుల్లో శ్వాస సంబంధమైన సమస్యలు అధికంగా కనిపిస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు సోకే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరం లక్షణాలు కనిపించక పోయినా చిన్న పిల్లలకు దగ్గు, జలుబు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

జిల్లాలో ఐదు రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా..

తేదీ నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు

జనవరి 7 6.3

జనవరి 8 5.9

జనవరి 9 6.0

జనవరి 10 8.0

జనవరి 11 7.0

Updated Date - Jan 11 , 2026 | 10:06 PM