అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:24 AM
అర్హులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా కౌన్సిలర్లు, సర్పంచులు దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు.
భువనగిరి రూరల్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): అర్హులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా కౌన్సిలర్లు, సర్పంచులు దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో కౌన్సిలర్లు, సర్పంచులకు ఒక్కరోజు శిక్షణ ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల వ్యవధిలో రైతు రుణ మాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్‌కార్డులు, సన్నబియ్యం సరఫరా వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఏ సమస్య తీవ్రంగా ఉందో ఆ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్‌పర్సన్లు ప్రణాళికాబద్ధంగా అర్హులకు అందేలా చూడాలన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, కలెక్టర్ అనురాగ్‌జయంతి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం పరిశుభ్రత పాటిస్తే గ్రామాలను అందంగా తీర్చదిద్దవచ్చన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్‌రావు, ఎస్పీ అక్షాంశ్‌యాదవ్, జడ్పీ సీఈవో ఎన్ శోభారాణి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, డీపీవో విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేతో సర్పంచుల వాగ్వాదం
కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులకే నిధులు కేటాయిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో భువనగిరి, వలిగొండ మండలాల బీఆర్‌ఎస్ సర్పంచులు వాగ్వాదానికి దిగారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా భువనగిరి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జక్క రాఘవేందర్‌రెడ్డి, వలిగొండ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు పడమటి మమతతో పాటు మరి కొందరు సర్పంచులు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించకుండా పక్షపాత ధోరణి సరికాదన్నారు. గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులు అడ్డుకుం టూ గ్రామాల అభివృద్ధికి సహకరించడం లేద ని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించారు. అన్ని గ్రామాలకు సమానంగా నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పేదల ఇళ్లు పోకుండా చూసే బాధ్యత నాదే : బీర్ల
ఆలేరు: నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు, ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని అయిలయ్య స్పష్టంచేశారు. ఆలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని దైవంపై ప్రమాణం చేసి చెబుతున్నా నమ్మాలని కోరారు. పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు, ఇళ్లను ప్రభుత్వం తొలగించేందుకు నిషేధిత జాబితా జీవో విడుదల చేసిందని అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్‌రాజు, ఎజాజ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, వెంకటస్వామి, మునిసిపల్ చైర్‌పర్సన్ బీజని బాలమణి భాస్కర్ ఉన్నారు.