Share News

చదువులమ్మ ఒడిలో సంక్షేమ సంబరం

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:14 AM

గురుకులాల్లో నాణ్యతను పెంచడం, సంస్థాగతంగా యంత్రాంగాన్ని పటిష్టం చేయడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడం, తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచడం లక్ష్యంగా సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా వారం రోజుల పాటు కలెక్టర్‌ సత్యప్రసాద్‌,

చదువులమ్మ ఒడిలో సంక్షేమ సంబరం

జగిత్యాల, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): గురుకులాల్లో నాణ్యతను పెంచడం, సంస్థాగతంగా యంత్రాంగాన్ని పటిష్టం చేయడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడం, తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచడం లక్ష్యంగా సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా వారం రోజుల పాటు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, జిల్లా అధికారులు, అడిషనల్‌ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధి కారులు సంక్షేమ బాట పట్టారు. ఈనెల 20వ తేదీతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీల్లో సమస్యల పరిష్కారం, వసతుల కల్పనే లక్ష్యంగా అధికారుల పర్యటన సాగుతోంది. భోజన నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, వంట పాత్రలు, కిచెన్‌ షెడ్‌ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, గదులు వాటి మరమ్మతులు తదితర అంశాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. సంక్షేమవారంలో భాగంగా తొలి రోజు గొల్లపల్లి మండలంలోని మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్‌ పాఠశాలను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని, నాణ్యత, రుచి, పరిశుభ్రత, వంట శాల నిర్వహణ, నీటి వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా సంక్షేమాధికారి రాజ్‌ కుమార్‌, డీఈఓ రాములు భాగస్వాములయ్యారు.

ఫప్రతీ రోజు ఒక్కో కార్యక్రమం..

జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, మోడల్‌స్కూళ్లు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో వారం రోజుల కార్యాచరణలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తొలి రోజు వంట శాలలు, స్నానపు గదులు, మూత్రశాలలను పరిశీలించి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు. మలి రోజు విద్యార్థుల ప్రతిభా ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా క్విజ్‌, వ్యాసరచన, వీధి నాటకాలు, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నాలు చేశారు. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. మూడో రోజు వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల భవనాలను పరిశీలించి మరమ్మతులు గుర్తించడం, ఇంజనీర్లను తీసుకెళ్లి అంచనాలు తయారు చేయడం, వాటిని ఆమోదించడం, అనంతరం నిధులు మంజూరు అయ్యేలా చూడడం వంటివి జరిపారు. నాలుగో రోజు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై పిల్లల ప్రగతి నివేదికను తల్లిదండ్రులకు వివరించి వారితో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదో రోజు నైపుణ్యాభివృద్ధి తెలియజేసి వాటి అమలుకు చర్యలు తీసుకుంటారు. ఆరో రోజు ఎంపిక చేసిన సంక్షేమ విద్యాలయాల్లో సమ్మర్‌ క్యాంపులు ప్రారంభిస్తారు. ఇందులో క్రీడలు, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడో రోజు బడి బాట కార్యక్రమం చేపడతారు. ఆయా వసతిగృహాల్లో ఉన్న ఖాళీలను గుర్తిస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలో వాటిని భర్తీ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.

ఫఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిక..

జిల్లాలోని వసతిగృహాలు, రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌లో సంక్షేమ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈమేరకు ఆయా ప్రిన్సిపాల్స్‌, వార్డెన్లకు ఆదేశాలు ఇచ్చారు. రోజువారీ నిర్వహించే కార్యక్రమాల ఫొటోలు, వీడియోలతో డాక్యుమెంటేషన్‌ రూపొందించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

ఫజిల్లాలోని వసతి గృహాలు,.

జిల్లా వ్యాప్తంగా 16 బీసీ హాస్టల్స్‌లో 880 మంది విద్యార్థులు, 19 ఎస్సీ హాస్టల్స్‌లో 736 మంది విద్యార్థులు, మూడు ఎస్టీ హాస్టల్స్‌లో 293 మంది విద్యార్థులున్నారు. మల్లాపూర్‌, రాయికల్‌ మండలం ఒడ్డెలింగాపూర్‌లో ఎస్‌టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 300 మంది విద్యార్థులు, జిల్లాలో ఐదు మైనార్టీ రెసిడెన్షియల్స్‌లో 600 మంది విద్యార్థులు, 8 ఎస్సీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 500 మంది విద్యార్థులు, 9 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 500 మంది, 14 కేజీబీవీల్లో 2,600 మంది, 13 మోడల్స్‌ స్కూల్స్‌లో 5,836 మంది విద్యార్థులున్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో బాలుర గురుకుల పాఠశాల, మల్యాల మండలం తాటిపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే పలు తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిశాయి. ఈనెల 23వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. చాలా మంది విద్యార్థులు ఇప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో వారోత్సవాలు నిర్వహిస్తుండడంతో ఉపయోగమేమిటి అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫసమస్యల తిష్ఠ

జిల్లాలోని చాలా సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తిష్ట వేశాయి. సీసీ కెమెరాల ఏర్పాటు లేదు. పలు వసతి గృహాలకు సొంత భవనాలు లేవు. మరికొన్ని వసతి గృహాలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా స్థలాలు లేవు. దీంతో పలు రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులు నేలపైనే నిద్రించడం, నేలపైనే అల్పాహారం, మధ్యాహ్నా భోజనం సేవించడం వంటివి చేస్తున్నారు. చాలా హాస్టల్స్‌లలో కోతుల బెడద నెలకొంది. గదులకు తలుపులు, కిటికీలు సక్రమంగా లేవు. స్నానపు గదులు సరిపోకపోవడం వల్ల పలు హాస్టల్స్‌లో విద్యార్థులు ఆరుబయట స్నానాలు చేస్తున్నారు. వసతిగృహాల వార్డెన్ల పర్యవేక్షణ లోపిస్తోంది. హాస్టళ్ల సంక్షేమ వారంలోనైనా అధికారులు విద్యార్థుల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్న ఆశతో తల్లిదండ్రులు ఉన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 01:14 AM