గుండెకు ‘వీకెండ్’ గండం!
ABN , Publish Date - May 01 , 2026 | 05:04 AM
ఎప్పుడో వారానికి ఓసారి.. ఒక పెగ్గు ఎక్కువ వేస్తే ఏం కాదులే.. చికెన్‌తో నాలుగు ముద్దలు ఎక్కువ తింటే కొంపలేం మునవులే.. అనుకుంటూ చాలా మంది వారాంతం,..
వారాంతాల్లో అతిగా మద్యం, మాంసం, మసాలా వంటల ఆరగింపుతో తీవ్ర ప్రభావం
సెలవు రోజుల్లోగుండె సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారు 30ు ఎక్కువ
‘హాలిడే హార్ట్ సిండ్రోమ్’గా వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడో వారానికి ఓసారి.. ఒక పెగ్గు ఎక్కువ వేస్తే ఏం కాదులే.. చికెన్‌తో నాలుగు ముద్దలు ఎక్కువ తింటే కొంపలేం మునవులే.. అనుకుంటూ చాలా మంది వారాంతం, పండుగ సమయాల్లో మద్యం, మాంసం, మసాలా ఆహార పదార్థాలను ఎక్కువగానే ఆరగించేస్తుంటారు. అయితే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే గుండెకు చేటు చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హాలిడే హార్ట్ సిండ్రోమ్ (హెచ్‌హెచ్‌ఎస్)గా పిలుస్తారని.. వారాంతం, హాలిడే సీజన్‌లో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయాల్లో తీసుకునే అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడి పెంచుతుందని.. అతిగా తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అవసరం పెరిగి గుండె మరింత కష్టపడాల్సి వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. యాభైౖ ఏళ్లు దాటిన వారు, ఇప్పటికే గుండె గమనంలో అసమానతలు (అరిథ్మియా) ఉన్నవారిలో తీవ్రత మరింత పెంచుతుందని, దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశముంటుందని హృద్రోగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ రోజుల కంటే సెలవులు, వారాంతాల్లో ఆస్పత్రుల్లో చేరే హార్ట్ ఫెయిల్యూర్ కేసులు 30 శాతం ఎక్కువగా నమోదవుతున్నాయని.. గతేడాది వచ్చిన రోగులను పరిశీలిస్తే ఇది తేలిందని యశోద ఆస్పత్రి కార్డియాలజిస్టు జగదీశ్ మాదిరెడ్డి వివరించారు. గతేడాది సాధారణ చెక్‌పలో పరీక్షలు చేయగా.. బ్లాకేజీలున్నట్లు నిర్ధారణ కావడంతో 68 శాతం మందికి అప్పటికప్పుడు స్టెంట్లు వేయాల్సి వచ్చిందన్నారు. దీనివల్ల ముందే గుండె సమస్యలు రాకుండా నివారించడానికి అస్కారం ఏర్పడిందని చెప్పారు. ఇక గుండె వైఫల్యంతో మరణాలు శీతాకాలంలో సుమారు 26 శాతం నుంచి 36 శాతం ఎక్కువగా ఉంటాయని కూడా వివరించారు.
మద్యపానంతో మహా ముప్పు..
కొంతకాలంగా వారాంతం, సెలవుల వేళ మద్యపానం సామాజిక అలవాటుగా మారుతోందని.. ఆఫీస్ పార్టీలు, కుటుంబ వేడుకలు, స్నేహితుల సమావేశాలు.. కార్యక్రమం ఏదైనా మితిమీరిన మద్యం గుండె విద్యుత్తు వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా మద్యం సేవిస్తే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందని.. దీనివల్ల గుండె స్పందనలు, బీపీ పెరిగి హార్ట్ ఫెయిలయ్యే ప్రమాదముందని వైద్యులు వివరిస్తున్నారు. మద్యం ఎక్కువగా తీసుకొని డ్రైవింగ్ చేస్తే గుండె స్పందనల్లో తేడా వస్తుందని.. అతి మద్యం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. మొదట మద్యం వల్ల వచ్చే అరిథ్మియాగా గుర్తించిన హెచ్‌హెచ్‌ఎస్.. ఇప్పుడు అనేక కారణాల వల్ల ఏర్పడే పరిస్థితిగా గుర్తించినట్లు వివరించారు. సాధారణంగా రోజుకు 300 మిల్లీలీటర్ల ఓ కూల్ డ్రింక్ తాగితే 200 కేలరీల వరకు మన శరీరంలోకి ప్రవేశిస్తాయని వైద్యులు చెబుతున్నారు. బిర్యానీ తింటే 2,000 కేలరీలు వరకు తీసుకున్నట్లేనని.. రెండు పూటలా తింటే ఇక ఆ రోజు అధిక కేలరీలు శరీరంలో చేరినట్లేనంటున్నారు. రోజుకు సాధారణ ఆహారంతో పాటు అదనంగా శీతల పానీయాలు, ఇతర ఫాస్ట్‌ఫుడ్ తీసుకుంటే ఎక్కువ కేలరీలు పెరిగి బరువు ఎక్కువ కావడానికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. గతంలో గుండె సమస్యలు వృద్ధుల్లోనే కనిపించేవని.. ఇప్పుడు 45 ఏళ్లలోపు వారిలో కూడా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు.
సెలవుల్లోనూ మానసిక అలసట..
సెలవులు, వారాంతాల్లో కాస్తా విశ్రాంతి తీసుకోవచ్చని అందరూ భావిస్తారని.. అయితే కొన్నిసార్లు అవి మానసికంగా అలసటను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రయాణాలు, అంచనాలు, భావోద్వేగ ఒత్తిడి కలిసి గుండెపై ప్రభావం చూపుతాయని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిపైనా ఈ ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో గుండె దడ పెరిగి కొన్నిసార్లు దీర్ఘకాలిక సమస్యగా మారి గుండె వైఫల్యానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. వారాంతపు సమయాల్లో రాత్రుల తర్వాత అకస్మాత్తుగా చలికి గురైతే గుండె కండరాలకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందక ఛాతీ నొప్పి (యాంజినా) వచ్చి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. ఇప్పటికే గుండె సమస్యలున్నవారిలో ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశముందని చెబుతున్నారు.
వారాంతాల్లో మితంగా తీసుకుంటే సరి
సెలవులు, వేడుకలు, వీకెండ్స్‌ను వదిలేయాల్సిన అవసరం లేదు.. కానీ ఏదైనా మితంగా తీసుకోవాలి. పరిమితంగా మద్యం తీసుకోవడం, తక్కువగా తినడం, సరిపడా నిద్ర ఉండాలి. నీరు బాగా తాగాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అధిక ఉప్పు, మద్యం వల్ల బీపీ ఒక్కసారిగా పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు. గుండె జబ్బుల చరిత్ర లేకపోయినా, అధిక మద్యం లేదా నిద్రలేమి వల్ల గుండె దడ లేదా అరిథ్మియా (ఏఎఫ్ఐబీ) ఏర్పడవచ్చు. రాత్రివేళలు మేలుకోవడం, బిజీ షెడ్యూల్, మానసిక ఒత్తిడి కూడా గుండె గమనంపై ప్రభావం చూపుతాయి. గుండె దడ, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, మూర్ఛ, అసాధారణ అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలను అజీర్తి లేదా వారాంతపు ఒత్తిడిగా నిర్లక్ష్యం చేయకూడదు. తొందరగా వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
- డాక్టర్ జగదీశ్ మాదిరెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు యశోద ఆస్పత్రి,సోమాజిగూడ