kumaram bheem asifabad- చెక్‌డ్యామ్ కాలువలను కమ్మేస్తున్న పిచ్చిమొక్కలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:20 PM
మండల కేంద్రంలోని పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ప్రధాన కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. అయినా సంబంధిత శాఖాధికారులు పట్టించుకోవడం లేదు.
- పట్టించుకోని అధికారులు
సిర్పూర్(టి), జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ప్రధాన కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. అయినా సంబంధిత శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఈ చెక్ డ్యాం కాలువ ద్వారా పెద్దబండ వాగు నీరు భీమన్న కుంటకు సరఫరా అయి అక్కడి నుంచి నాగమ్మ చెరువుకు కాలువ ద్వారా సరఫరా అవుతుంది. దీంతో పాటు దీని కింద ఉన్న రెండు వేల ఎకరాల్లో రైతులు రెండో పంట గా శనగలు, గోధుమలు, వరి వేస్తారు. ప్రధాన కాలువ ద్వారా వచ్చిన నీటిపైనే రైతులు ఆధార పడుతారు. దీంతో పాటు నాగమ్మ చెరువులో గత నవంబర్ నెలలో ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి చేప పిల్లల జారవిడిచింది. చెరువులో ఉన్న వర్షపు నీరు రానున్న ఎండ కాలంలో భూగర్భ జలం ఎండి పోయినట్లయితే ఇటు చేప పిల్లలు, అటు యాసంగి పంటలు నష్ట పోయే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత అదికారులు స్పందించి పెద్దబండ చెక్ డ్యాం వద్ద కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగించి నాగమ్మ చెరువులోకి వాగునీరు వచ్చే విధంగా పనులు చేపట్టాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు. లేని పక్షంలో పశువులకు సైతం ఎండకాలంలో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు చెబుతున్నారు. సిర్పూర్ (టి) మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో 27 గ్రామాల్లో నీటి వసతి సౌకర్యం ఉన్న భూములలో ఈ సారి రెండు వేల ఎకరాల్లో వరి 200 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 200 ఎకరాల్లో ఇతర ఆరుతడితో పాటు కూరగాయల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.