Share News

kumaram bheem asifabad- మాజీ మావోయిస్టు కుటుంబాన్ని ఆదుకుంటాం

ABN , Publish Date - Mar 25 , 2026 | 10:25 PM

మాజీ మావోయిస్టు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కలెక్టర్‌ హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించి జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఎస్పీ నితికా పంత్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.

kumaram bheem asifabad- మాజీ మావోయిస్టు కుటుంబాన్ని ఆదుకుంటాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మాజీ మావోయిస్టు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కలెక్టర్‌ హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించి జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఎస్పీ నితికా పంత్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసిఫాబాద్‌ పట్టణంలోని సందీప్‌నగర్‌కు చెందిన బోయిని నగేష్‌ అనే మాజీ మావోయిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరికి చర్యలు తీసుకుంటామని అన్నారు. నగేష్‌ సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి లావుని పట్టా మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామన్నారు. నగేష్‌ భార్యను మహిళా సంఘాల గ్రూపుల్లో సభ్యురాలిగా చేర్పించి బ్యాంకు రుణం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పదో తరగతి చదివి మానేసిన నగేష్‌ కూతురు ఉన్నత చదువులు కోసం చేయూతనిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

లోలెవల్‌ వంతెనల స్థితిగతులు పరిశీలించాలి

లింగాపూర్‌/సిర్పూర్‌(యు), మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అధికారులు ఎప్పటి కప్పుడు లోలెవల్‌ వంతెనల స్థితిగతులు పరిశీలించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. లింగాపూర్‌, సిర్పూర్‌(యు), జైనూర్‌ మండలాల్లో బుధవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లింగాపూర్‌ మండలంలోని అల్లిగూడా నుంచి కొత్తపల్లి వరకు రోడ్డు పై ఉన్న లోలెవల్‌ వంతెనల స్థితిగతులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లో హైలెవల్‌ వంతెనలు నిర్మించేందుకు ప్రతిపాదనలు వెంటనే పంపించాలని ఇంజినీరింగ్‌ అధి కారులను ఆదేశించారు. అనంతరం కంచన్‌పల్లి ములాగూడా గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. సిర్పూర్‌(యు) మండలంలోగల మహగాంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని అన్నారు. సిర్పూర్‌ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల విద్యాలయాని సందర్శించి భోజనం పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డించాలని చెప్పారు. తాజా కూరగాయలను మాత్రమే వంటలకోసం వినియోగించుకోవాలని అన్నారు. స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. భోజనంలో తప్పనిసరిగా మెనూ పాటించాలని చెప్పారు. విషయాల వారీగా తరగతుల నిర్వహణ కొనసాగుతుంతా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూడాలని చెప్పారు. అనంతరం కోహనూర్‌ సిడంగూడా రోడుపైగల బ్రిడ్జిను పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని చెప్పారు. జైనూర్‌ మండలంలోని గౌరి రోడ్డపైగల బ్రిడ్జిని పరిశీలించి కొత్తవాటికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కలెక్టర్‌ వెంటా పంచాయతీరాజ్‌ డీఈ ఫజిల్‌హక్‌, ఏఈ అరవింద్‌, ఘూంనూర్‌ సర్పంచ్‌ శేషునారాయణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 10:25 PM