kumaram bheem asifabad-పోడు భూముల సమస్యలు సామరస్యంగా పరిష్కరిస్తాం
ABN , Publish Date - May 19 , 2026 | 10:30 PM
గిరిజనులకు అటవీ ఇబ్బందులు లేకుండా పోడు భూముల సమస్యలు సామరస్యంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రాష్ట్ర కమిషన్ సభ్యుడు జిల్ల శంకర్ అన్నారు. చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్, తహసీల్దార్ ప్రకాష్, జిల్లా పరిశ్రమల శాఖాధికారి అశోక్, భూ ఏడీ సర్వేయర్ వినయ్, అటవీ డివిజనల్ అధికారి అప్పన్న, గ్రామస్తులతో కలిసి హాజరయ్యారు
చింతలమానేపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు అటవీ ఇబ్బందులు లేకుండా పోడు భూముల సమస్యలు సామరస్యంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రాష్ట్ర కమిషన్ సభ్యుడు జిల్ల శంకర్ అన్నారు. చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్, తహసీల్దార్ ప్రకాష్, జిల్లా పరిశ్రమల శాఖాధికారి అశోక్, భూ ఏడీ సర్వేయర్ వినయ్, అటవీ డివిజనల్ అధికారి అప్పన్న, గ్రామస్తులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిషన్ సభ్యులు మాట్లాడుతూ గిరిజన రైతులు తమ కుటుంబాలను పోషించుకునేం దుకు గత సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములలో సాగు అవుతున్న పంటలను అటవీ శాఖాధికారులు ధ్వంసం చేశారని, భూముల చుట్టు పెన్షింగ్ ఏర్పాటు చేసి ఇబ్బందులు పడుతున్నారని రైతులు చేసిన ఫిర్యాదు మేరకు రావడం జరిగిందని తెలిపారు. సుమారు 50 షెడ్యూల్డ్ కులాలకు చెందిన కుటుంబాలకు 2/3 ఎకరాల చొప్పున పంట సాగు పై ఆధార పడి జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా భూ తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని, వారి జీవనాధారమైన పోడు భూముల సమస్యలను సామరస్య పూర్వకంగా పరిస్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పోడు భూముల విషయంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బం దులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కార మార్గాలు చూపిస్తామని తెలిపారు. గిరిజనులకు అటవీ శాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు చేపడుతామని చెప్పారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు పారదర్శకంగా పని చేయాలని సూచించారు. గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుందని తెలిపారు. పోడు భూముల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పరిష్కారానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తుందని, ప్రజలు అధికారులకు సహకరించి అవసరమైన వివరాలు అందించాలని కోరారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, భూముల పరిస్థితులు, అటవీ సంబంధిత ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు సమస్యను త్వరిగతిన పరిశీలించి నివేదిక సమర్పించాలని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.