kumaram bheem asifabad-మా భూముల జోలికి వస్తే ఊరుకోం
ABN , Publish Date - Jun 06 , 2026 | 10:44 PM
ఐదు దశాబ్దాల నుంచి భూములు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తమ భూములను అటవీ అధికారులు లాక్కుంటే ఊర్కొబోమని లుంబినీనగర్, రెబ్బెన గ్రామాల రైతులు హెచ్చరించారు. మండలంలోని లుంబినీనగర్, రెబ్బెన గ్రామ శివారులో గల భూముల్లో శనివారం అటవీ అధికారులు ట్రాక్టర్ల ద్వారా చదును చేయించేందుకు ప్రయత్నం చేయగా రైతులు అడ్డుకున్నారు.
బెజ్జూరు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఐదు దశాబ్దాల నుంచి భూములు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తమ భూములను అటవీ అధికారులు లాక్కుంటే ఊర్కొబోమని లుంబినీనగర్, రెబ్బెన గ్రామాల రైతులు హెచ్చరించారు. మండలంలోని లుంబినీనగర్, రెబ్బెన గ్రామ శివారులో గల భూముల్లో శనివారం అటవీ అధికారులు ట్రాక్టర్ల ద్వారా చదును చేయించేందుకు ప్రయత్నం చేయగా రైతులు అడ్డుకున్నారు. ఈ విషయంలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా రైతుల పక్షాన సర్పంచ్ రాంప్రసాద్ మాట్లాడుతూ లుంబినీనగర్, రెబ్బెన శివారులో సర్వే నంబరు 96లో అప్పటి ప్రభుత్వం ఐదో విడత భూ పంపిణీలో 237 ఎకరాల భూమిని పంపిణీ చేసిందని చెప్పారు. దానికి సంబంధించిన పట్టాలు ఉన్నప్పటికీ అధికారులు తమ భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నం చేయడం సరికాదన్నారు. అటవీ అధికారులు ఈ భూములు అటవీ శాఖకు సంబంధించిన భూములు కావడంతో చదును చేస్తున్నామని చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఒక దశలో దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. బెజ్జూరు, సిర్పూర్(టి), పెంచికలపేట మండలాలకు చెందిన అటవీ అధికా రులు పెద్ద మొత్తంలో చేరుకున్నారు. అదే స్థాయిలో రైతులు కూడా భారీగా తరలి వచ్చా రు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో డీఎఫ్‌వో అప్పయ్యకు ఫోన్‌లో సమాచారం అందించారు. రైతులతో మాట్లాడి రెండు రోజుల్లోగా క్షేత్ర పర్యటన చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.