రెడ్డి సొసైటీ అభివృద్ధికి సహకారం అందిస్తాం
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:19 AM
రెడ్డి సామాజిక వర్గంలోని పేద విద్యార్థుల చదువుల కోసం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కృషిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): రెడ్డి సామాజిక వర్గంలోని పేద విద్యార్థుల చదువుల కోసం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కృషిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో బుధవారం నిర్వహించిన రాజా బహద్దూర్ వెంకటరాంరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాలలో రెడ్డి కులస్థులు ముందంజలో ఉంటారన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఎంతోమంది పేదవారు ఉన్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గ్రామాలలో ఉన్న రెడ్డి పేద విద్యార్థులు ఉన్నత చదువులకు సొసైటీ నుంచి ఆర్థిక సహకారం, తోడ్పాటు అందించాలని సూచించారు. రెడ్డిలు అంటే అందరూ ధనికులు లేరని, సామాన్య కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రెడ్డి వసతి గృహంలో విద్యార్థులు అన్ని వసతులతో చదువుకోవాలన్నారు. ముఖ్యంగా సాంకేతిక సంబంధిత కోర్సుల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి సొసైటీ సంఘం పదవులు పొందిన వారు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పదవి చిన్నది..పెద్దది అని చూసుకోకుండా చేపట్టిన పదవికి న్యాయం చేయాలన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన సొసైటీకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. పేదలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎళ్లవేళలా అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, రాజబహదూర్ వెంకటరామిరెడి,్డ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మూల దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఊరుకొండ ప్రభాకర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
రెడ్డిల్లోనూ కటిక పేదలు : శాసనమండలి చైర్మన్ గుత్తా
రెడ్డి కులంలో అందరూ సంపన్నులు లేరని వాళ్లలోనూ కటిక పేదవారు ఉన్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారు అని రెడ్డిలే ఎదురు చూస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి జరిగితేనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. బాగుంటే ఆ ఊరిలో ఉన్న అన్ని కులాలు బాగుంటాయి అనేది మనకు తెలుసన్నారు. రెడ్డి కులంలో ఉన్న పేద విద్యార్థులకు సహాయం అందించి వారి భవిష్యత్తు కోసం కృషి చేయాన్నారు. రాష్ట్రంలో నేటి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు కట్టి మళ్లీ అప్పులు తేస్తేనే రాష్ట్రం నడిచేలా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.