kumaram bheem asifabad- పనులు వేగంగా పూర్తి చేస్తాం
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:19 PM
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పనులు వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. వాంకిడి మండలం బెండార గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం ఆయన పరిశీలించారు.
వాంకిడి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పనులు వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. వాంకిడి మండలం బెండార గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాతమకంగా నియోజక వర్గానికి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపడుతుందని తెలిపారు. గురుకులంలో విశాలమైన గదులు, పాఠశాల భవనాలు, క్రీడా స్థలం ఏర్పాటుకు సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరం ఉంటుందని అన్నారు. సర్వే అధికారులు, టీజీఈడబ్ల్యూ ఐడీసీ అధికారులు వెంటనే స్ధలానికి హద్దులు నిర్ధారించి చదును చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణం దావరా ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, సాంకేతికత, నైపుణ్యతతో కూడిన శిక్షణ లభిస్తుందని తెలిపారు. భవన నిర్మాణాలు చేపట్టి వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, వాంకిడి తహసీల్దార్‌లు రియాజ్ అలీ, కవిత, సర్వేయర్లు రామకృష్ణ, టీజీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో కలిసి శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో 20 వార్డులు, కాగజ్‌నగర్ మున్సిపల్ పరిదిలో 30 వార్డులకు డెడికేషన్ కమిషన్ కేటాయింపు ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ నిర్వహించామని తెలిపారు. మహిళలకు కేటాయించిన వార్డులను లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ కేటాయించామని వివరించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనక బడిన తరగతులు, జనరల్ మహిళలు 50 శాతం సీట్లను మహిళలకు కేటయించామని చెప్పారు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్లు గజానన్, రాజేందర్, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.