Share News

బతుకు, భవిష్యత్తును బలిచేసిన ట్యాంకర్‌!

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:35 AM

వచ్చే జీతం భార్యాపిల్లల పోషణకే సరిపోవడం లేదు. పండగొస్తోంది.. కిరాణా సామాను, కొత్త బట్టలు అవీ కొనాలి! ర్యాపిడో రైడర్‌గా కొన్నాళ్లు చేస్తే ఆ అదనపు సంపాదనతో పండుగ ఖర్చులు వెళ్లిపోతాయి....

బతుకు, భవిష్యత్తును బలిచేసిన ట్యాంకర్‌!

  • ర్యాపిడో బైక్‌ను ఢీకొట్టిన వాటర్‌ ట్యాంకర్‌.. రైడర్‌, వెనుక కూర్చున యువతి దుర్మరణం

బంజారాహిల్స్‌/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వచ్చే జీతం భార్యాపిల్లల పోషణకే సరిపోవడం లేదు. పండగొస్తోంది.. కిరాణా సామాను, కొత్త బట్టలు అవీ కొనాలి! ర్యాపిడో రైడర్‌గా కొన్నాళ్లు చేస్తే ఆ అదనపు సంపాదనతో పండుగ ఖర్చులు వెళ్లిపోతాయి అనే ఉద్దేశం ఆ హోంగార్డుది! రైడ్‌ను బుక్‌ చేసుకున్న యువతికేమో విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల! వీసా ఇంటర్వ్యూ కోసం ఏపీ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కొచ్చింది! అయితే.. హోంగార్డు బతుకు పోరాటాన్ని.. ఉజ్వల భవిష్యత్తు దిశగా యువతి ఆరాటాన్ని ఆ రాకాసి వాటర్‌ ట్యాంకర్‌ నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది. బైక్‌ మీద వెళుతున్న ఇద్దరూ ట్యాంకర్‌ కింద నలిగి దుర్మరణంపాలయ్యారు. సోమవారం ఉదయం బంజారాహిల్స్‌ వెంగళరావు పార్కు వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. చంద్రాయణగుట్ట అల్జుబెల్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌ (40) సంతో్‌షనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, 10, 8, 7 తరగతులు చదువుతున్న ముగ్గురు కుమారులున్నారు. భార్య ఇంటి వద్దే ఉంటోంది. రంజాన్‌ పండుగ సమీపిస్తుండటంతో ట్రాఫిక్‌ విధులు ముగిశాక హుస్సేన్‌ ర్యాపిడోలో బైక్‌ నడుపుతున్నాడు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన అక్షిత (22) హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ పూర్తిచేసింది. కొన్నాళ్లు నగరంలోనే ఉద్యోగం చేసి.. ఏడాది క్రితం తిరిగి స్వస్థలానికి వెళ్లిపోయింది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆమె, దుబాయ్‌ వీసా కోసం దరఖాస్తు పెట్టుకుంది. వీసా ఇంటర్వ్యూకు తేదీ ఖరారు కావడంతో నిబంధనల ప్రకారం ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు 22న నగరానికి వచ్చింది. చింతల్‌లో స్నేహితురాలి వద్ద దిగింది. ఆరోగ్య పరీక్షల కోసం సోమవారం ఉదయం మెహదీపట్నంకు వచ్చింది. అక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి చింతల్‌ వెళ్లేందుకు ర్యాపిడో బుక్‌ చేసింది. ఇక అప్పటికే ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో 8గంటలకు విధులు ముగించుకున్న హుస్సేన్‌ చాంద్రాయణ గుట్ట మీదుగా రేతిబౌలి చేరుకున్నాడు. అక్కడ ర్యాపిడో యాప్‌ ఓపెన్‌ చేశాడు. మెహదీపట్నం నుంచి చింతల్‌ వరకు రైడ్‌ తగిలింది. వెంటనే మెహదీపట్నంకు వెళ్లాడు. అక్కడ ర్యాపిడో బుక్‌ చేసిన అక్షితను బైక్‌ మీద కూర్చోబెట్టుకొని చింతల్‌ బయలుదేరాడు. వీరు ప్రయాణిస్తున్న బైక్‌.. బంజారాహిల్స్‌ వెంగళరావు పార్కు వద్ద ప్రమాదానికి గురైంది. అక్కడ హుస్సేన్‌ మలుపు తీసుకుంటుండగా పక్క నుంచి వెళుతున్న వాటర్‌ ట్యాంకర్‌ వెనుక భాగం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో హుస్సేన్‌, అక్షిత ఇద్దరూ ట్యాంకర్‌ కింద పడ్డారు. ఆ భారీ వాహనం వెనుక చక్రాలు ఇద్దరిపై నుంచి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. హుస్సేన్‌ మృతితో అతడి భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు. తమ బిడ్డ ఇక లేదనే వార్త చెవిన పడటంతో అక్షిత కుటుంబసభ్యులు కంటికీమంటికి ధారగా రోదిస్తున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 05:51 AM