మూసీ నీటి వృథా.. ఆగేదెలా?
ABN , Publish Date - May 12 , 2026 | 12:17 AM
అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు నీరు వృథా అవుతోంది. మూసీ కుడి ప్రధాన కాల్వలో కొద్దిరోజులుగా నీరు ప్రవహిస్తోంది.
కేతేపల్లి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు నీరు వృథా అవుతోంది. మూసీ కుడి ప్రధాన కాల్వలో కొద్దిరోజులుగా నీరు ప్రవహిస్తోంది. 645అడుగులు(4.46టీఎంసీలు) పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది యాసంగిలో ఆయకట్టుకు సాగునీటి విడుదల నిలిపి వేసిన తర్వాత(ఏప్రిల్ మొదటి వారంలో) ప్రాజెక్టు నీటిమట్టం 624అడుగుల డెడ్‌స్టోరేజీకి పడిపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మూసీ పరీవాహక గ్రామాల నుంచి వస్తున్న నీటితో మూసీ రిజర్వాయర్ నీటిమట్టం ఒక్కో పాయింటు చొప్పున పెరుగుతూ వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకున్నా హైదరాబాద్ నగర డ్రైనేజీ నీరంతా దిగువన గల మూసీకి వస్తుండడంతో వేసవిలో సైతం ఎగువ నుంచి క్రమం తప్పకుండా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఏప్రిల్ మొదటి వారంలో 624అడుగుల కనిష్ట నీటినిల్వకు పడిపోయిన మూసీ ప్రాజెక్టు నీటిమట్టం గత నెల రోజుల్లో దాదాపు 11అడుగుల మేర పెరిగి సోమవారం సాయంత్రానికి 635.25అడుగులు(2.23టీఎంసీ)లుగా నమోదైంది. ఎగువ నుంచి 402.65 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. గతంలో వానాకాలం ఆరంభంలో వచ్చే వర్షాలతో ప్రాజెక్టులోకి కొద్దిపాటి నీరు చేరినా ఈ ప్రాజెక్టు అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే తుఫాను వర్షాలు లేదా ఈశాన్య రుతుపవనాల వల్ల వచ్చే వర్షాలకు మాత్రమే పూర్తిస్థాయిలో నిండేది. ఈ ఏడాది సైతం మండు వేసవిలోనే ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుంది. వేసవి ఎండల తీవ్రతలోనూ ప్రాజెక్టు క్రమంగా జలకళను సంతరించుకుంటుంటే ఎగువ నుంచి వచ్చిన నీటిని కాపాడడంలో ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో మూసీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వలో నీరు వృథా ప్రవహిస్తోంది. నెల రోజులుగా కాల్వలో అడపాదడఫా నీరు ప్రవహిస్తున్నా.. నాలుగు రోజుల నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండడం చర్చనీయంగా మారింది. మూసీ రిజర్వాయర్ వద్ద కుడి కాల్వ గేటు నుంచి లీకై నీళ్లు వస్తున్నాయా అనే చర్చ నడుస్తోంది. నీరు వృథాగా కాల్వలో ప్రవహిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు గ్రామాల రైతులు కోరుతున్నారు.
కుడి కాల్వ గేటు మరమ్మతులకు గురైంది
ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ గేటు ఇటీవల మరమ్మతులకు గురైంది. ఈ క్రమంలో రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో గేటు నుంచి నీరు లీకేజీ రూపంలో బయటకు వస్తోంది. గేటుకు మరమ్మతులు చేయించి నీటి లీకేజీలను అరికడతాం.
మమత, కుడికాల్వ ఏఈ