మళ్లీ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లు!
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:12 AM
ఒకవైపు పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం.. అల్పాదాయ(ఎల్‌ఐజీ), మధ్య తరగతి(ఎంఐజీ), అధిక ఆదాయ(హెచ్‌ఐజీ) వర్గాలకూ సరసమైన ధరలకు ఇళ్లను అందించాలని భావిస్తోంది.
వరంగల్‌లో అపార్ట్‌మెంట్ల నిర్మాణంపై నజర్.. తొలిదశలో 10 ఎకరాల్లో జీప్లస్ 5 నిర్మాణాలు
మొత్తం 700 ఫ్లాట్లు.. 7 లక్షల చదరపు అడుగులు
అల్ప, మధ్య, అధిక ఆదాయ వర్గాల ప్రజలకు తక్కువ ధరకే ఫ్లాట్లు విక్రయించేందుకు ప్రణాళికలు
త్వరలో సర్కార్‌కు నివేదిక
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం.. అల్పాదాయ(ఎల్‌ఐజీ), మధ్య తరగతి(ఎంఐజీ), అధిక ఆదాయ(హెచ్‌ఐజీ) వర్గాలకూ సరసమైన ధరలకు ఇళ్లను అందించాలని భావిస్తోంది. ఈ మేరకు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే వరంగల్ జిల్లాలోని కాకతీయ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (కుడా) పరిధిలో ఉన్న 25 ఎకరాల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని హౌసింగ్ బోర్డు భావిస్తోంది. మొదటిదశలో 10 ఎకరాల్లో జీ ప్లస్ 5 లేదా జీ ప్లస్ 6 అంతస్తుల విధానంలో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తే.. ఎన్ని ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా ఒక నివేదికను రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జాయింట్ వెంచర్ విధానంలో నిర్మించిన ఇళ్లలో బోర్డుకు వచ్చిన వాటా ఇళ్ల విక్రయాలకు మంచి ఆదరణ వచ్చింది. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఖమ్మం, వరంగల్ పరిధిలో ఉన్న ఫ్లాట్ల కొనుగోలుకు అధిక దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలోనే స్థలం ఉన్న చోట మళ్లీ ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ వర్గాల కోసం ఇళ్లను నిర్మిస్తే బోర్డుకు ఆదాయం రావడంతోపాటు ఆయా వ ర్గాలకు సరసమైన ధరల్లోనే సొంతింటి కలను నెరవేర్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరంగల్ జిల్లాలో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు శ్రీకారం చుడుతోంది.
700 ఫ్లాట్లు.. 7లక్షల చదరపు అడుగులు
అఫర్డ్‌బుల్ హౌసింగ్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇందుకోసం ప్రస్తుతం డ్రాఫ్టింగ్ జరుగుతోంది. ఒకవైపు ఈ ప్రక్రియ జరుగుతుండగానే.. వరంగల్‌లో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని హౌసింగ్ బోర్డు భావిస్తోంది. మొదటి విడతలో కుడా పరిధిలోని 10 ఎకరాల్లో అపార్ట్‌మెంట్లను నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వాటిలో అల్పాదాయ వర్గాల కోసం 650 చదరపు అడుగుల చొప్పున 300 ఫ్లాట్లు, మఽధ్య ఆదాయ వర్గాల కోసం 1000 చదరపు అడుగుల చొప్పున 200 ఫ్లాట్లు, అధిక ఆదాయ వర్గాల కోసం 1,600 చదరపు అడుగుల చొప్పున మొత్తం 200 ఫ్లాట్లను నిర్మించాలని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. అన్ని వర్గాలకు కలిపి 7,15,000 చదరపు అడుగుల్లో, మొత్తం 700 ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఎల్‌ఐజీ ఫ్లాట్‌కు రూ.19.20లక్షలు, ఎంఐజీ ఫ్లాట్‌కు రూ.30లక్షలు, హెచ్‌ఐజీ ఫ్లాట్‌కు రూ.57.45లక్షల చొప్పున ధర ఖరారు చేయగా, వీటి ద్వారా రూ.235 కోట్ల వరకు వస్తాయని అంచనా వేశారు. అయితే, ఈ నివేదికలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొదటిదశలో నిర్మించాలని భావిస్తున్న వాటిలోనూ ఫేజ్-1లో 280, ఫేజ్-2లో 420 ఫ్లాట్ల చొప్పున నిర్మించాలని యోచిస్తున్నారు. సాధ్యాసాధ్యాలన్నింటినీ సమగ్ర నివేదికలో పొందుపర్చి త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలిసింది. కాగా సర్కారు ఆమోది ంచాక.. అపార్ట్‌మెంట్ల డిజైన్ రూపొందించి, ఆసక్తి ఉన్నవారి నుంచి కొంత డిపాజిట్ సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అన్ని వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.