Share News

వరంగల్‌లో ప్రభుత్వ కేన్సర్‌ ఆస్పత్రి

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:51 AM

రాష్ట్రంలో ఎంఎన్‌జే తర్వాత రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్‌ ఆస్పత్రిని వరంగల్‌లో ఏర్పా టు చేస్తామని ఆరోగ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రకటించారు.

వరంగల్‌లో ప్రభుత్వ కేన్సర్‌ ఆస్పత్రి

  • ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

  • ఎంజీఎంలో అదనంగా మరో 9 సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు

  • వైద్యమంత్రి రాజనర్సింహ

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంఎన్‌జే తర్వాత రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్‌ ఆస్పత్రిని వరంగల్‌లో ఏర్పా టు చేస్తామని ఆరోగ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రకటించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక కేన్సర్‌ వైద్యసేవలు అందించేలా వరంగల్‌ రీజనల్‌ కేన్సర్‌ ఆస్పత్రిని అభివృద్థి చేస్తామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తెస్తామన్నారు. వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై మంగళవారం సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమీక్షించారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, నాయిని రాజేందర్‌ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, యశస్విని రెడ్డి, కేఆర్‌ నాగరాజు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల్లోని ఆస్పత్రుల్లో వైద్య సేవల ను ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. ఎంజీ ఎం హాస్పిటల్‌లో ప్రస్తుతం 29 స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తుండగా, మరో 9 సూపర్‌ స్పెషాలిటీ సేవలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. జనగామ, నర్సంపేట హాస్పిటళ్లు, మెడికల్‌ కాలేజీలను మరింత అభివృద్థి చేస్తామని, హన్మకొండలో ఐవీఎఫ్‌ సెంటర్‌తో పా టు డ్రగ్‌ అండ్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏ ర్పా టు చేస్తామని తెలిపారు. రీజనల్‌ ఐ హాస్పిటల్‌లో అత్యాధునిక కంటి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఎంజీ ఎం హాస్పిటల్‌కు అడిషనల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ను రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌గా నియమిస్తామన్నారు. చౌటుప్పల్‌లో మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌, ట్రామా కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. మునుగోడు లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చించారు. నాంపల్లి, మనుగోడులోని పీహెచ్‌సీలను కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీని మంత్రి ఆదేశించారు.

Updated Date - Aug 05 , 2026 | 05:53 AM