Share News

రెండేళ్లలో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:43 AM

తెలంగాణలోని వరంగల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.

రెండేళ్లలో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌

  • 2028 జూన్‌ 2 నాటికి పూర్తి చేస్తాం

  • దేశంలోనే బెస్ట్‌ టెర్మినల్‌గా మామునూరు

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో రికార్డు స్థాయిలో పూర్తయిన భూసేకరణ

  • గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఆలస్యం

  • ఆదిలాబాద్‌లో వ్యూహాత్మక ఎయిర్‌పోర్టు

  • దీనిపై కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు

  • మీడియాతో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు

న్యూఢిల్లీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని వరంగల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. 2028లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2 నాటికి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టుదలతో రికార్డు స్థాయిలో భూసేకరణ పూర్తి చేశారని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ టెర్మినళ్లలో ఒకటిగా దీనిని తీర్చిదిద్దుతామన్నారు. అలాగే, ఆదిలాబాద్‌లోనూ రక్షణ శాఖ భాగస్వామ్యంతో సరిహద్దు వ్యూహాత్మక విమానాశ్రయాన్ని నిర్మిస్తామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ తర్వాత ఆయనతో కలిసి రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడారు. విమానయాన మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చొరవను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్‌ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేేసందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో అడుగులు వేసిందని కొనియాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఏళ్ల తరబడి జటిలంగా మారిన భూసేకరణ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించారని ప్రశంసించారు. గతంలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) వద్ద 700 ఎకరాలు ఉండగా, మిగిలిన భూమిని ేసకరించి ఇస్తే పనులు చేపడతామని కేంద్రం చెప్పిందని, కానీ.. నాటి పాలకులు స్పందించలేదని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం బాధ్యత తీసుకుని రికార్డు సమయంలో 253 ఎకరాల భూమిని సమీకరించి విమానయాన సంస్థకు అప్పగించారని తెలిపారు. ఇచ్చినమాట ప్రకారం ఒక్క ఎకరం కూడా తగ్గకుండా భూమిని బదిలీ చేయడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ఇంత వేగంగా భూసేకరణ జరుగుతుందని తాము కూడా ఊహించలేదన్నారు. ఇప్పటికే సరిహద్దు గోడ (బౌండరీ వాల్‌) నిర్మాణానికి టెండర్లు వేశామని, రన్‌వే నిర్మాణానికి టెండర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రధాన టెర్మినల్‌ భవనం, ఇతర కార్యకలాపాల కోసం రాబోయే మూడు, నాలుగు వారాల్లో టెండర్లు పిలిచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభిస్తామన్నారు.


కాకతీయ వైభవంతో..

వరంగల్‌ అంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సైతం ఎంతో ఇష్టమని, అందుకే కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తోందని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ‘‘ఓరుగల్లుకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా, దేశంలోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ కల్చరల్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ టెర్మినల్‌గా దీనిని తీర్చిదిద్దుతాం’’ అని అన్నారు. ఈ టెర్మినల్‌ రూపకల్పనలో కాకతీయ సామ్రాజ్య శిల్పకళ, వారు నిర్మించిన ఆలయాల సంస్కృతిని జోడిస్తామన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ విమానయాన అవసరాలు పెరిగాయని, వరంగల్‌లోని ఇండస్ర్టియల్‌ హబ్‌, టెక్స్‌టైల్‌ పార్కులకు ఈ ఎయిర్‌పోర్ట్‌ సరికొత్త డిమాండ్‌ను తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఇక ఆదిలాబాద్‌ విమానాశ్రయం నిర్మాణంపైనా సీఎం రేవంత్‌రెడ్డి పట్టుబడుతున్నారని కేంద్రమంత్రి తెలిపారు. అక్కడ ఇప్పటికే రక్షణ శాఖ పరిధిలో 250 ఎకరాల భూమి సిద్ధంగా ఉండటం సానుకూలాంశమన్నారు. పౌర అవసరాలతోపాటు రక్షణ వ్యూహాత్మక ప్రాంతంగా దీనిని అభివృద్ధి చేయడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఆ భేటీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 1,700 ఎకరాల భూమి అవసరం కాగా, ఆ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. ఇక్కడ నిర్మించే విమానాశ్రయం ఆదిలాబాద్‌కు సరిహద్దుగా ఉన్న రాష్ర్టాలకు వ్యూహాత్మక రక్షణ స్థావరం కానుందని పేర్కొన్నారు. ఇక ‘వికసిత్‌ భారత్‌-2047’ నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన హబ్‌గా మార్చడమే లక్ష్యమని రామ్మోహన్‌నాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో రూ.30 వేల కోట్లతో దేశవ్యాప్తంగా మరో 100 కొత్త ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్‌లను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి ప్రాజెక్టును ‘భారతదేశ ప్రాజెక్టు’గానే భావిస్తామని, ఇందులో రాష్ర్టాల సహకారమే ముఖ్యమని స్పష్టం చేశారు.

Updated Date - Jul 15 , 2026 | 05:44 AM