ఓరుగల్లు ‘టేకాఫ్’
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:44 AM
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా మామునూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం చేసిన కృషి ఫలించింది. అక్కడ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల నిర్వహణకు టెండర్లు
రూ.2,034.98 కోట్లతో రన్‌వే, కొత్త ఏప్రాన్ సహా
పలు నిర్మాణాలు.. 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం
29 నుంచి ఆగస్టు 12 దాకా బిడ్లు.. 18న ఓపెన్
శంషాబాద్ ఎయిర్‌పోర్టు తరహాలో సౌకర్యాల కల్పన
కాకతీయ వైభవం ప్రతిబింబించేలా నిర్మాణాలు
949 ఎకరాల్లో నిర్మాణం.. ఏ-320 తరహా పెద్ద పెద్ద
విమానాలు, భారీ కార్గో సర్వీసులు తిరిగేలా రన్‌వేలు
ఎంఆర్‌వో, ఎఫ్‌టీవో నిర్మాణాలకు త్వరలో మరో టెండర్
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా మామునూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం చేసిన కృషి ఫలించింది. అక్కడ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిర్మాణ పనుల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. రన్‌వే పునర్నిర్మాణం, కొత్త ఏప్రాన్, లింక్ టాక్సీవే, ఐసోలేషన్ బే, పెరిమీటర్ రోడ్డు, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్డు తదితరాల నిర్మాణం కోసం రూ. 2,034.98 (జీఎస్టీ చార్జీలు అదనం) కోట్ల అంచనా వయ్యంతో.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులను 15 నెలల్లోగా పూర్తిచేయాలని లక్ష్యం విధించారు. అందుకు తగ్గట్టుగానే ఏఏఐ కూడా టెండర్ పనుల పూర్తికి తేదీలను ఖరారు చేసింది. దాని ప్రకారం ఈ నెల 23న (గురువారం)ప్రీ-బిడ్ సమావేశాన్ని వరంగల్ విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టు టెండర్ నోట్‌లో పేర్కొన్నారు. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకూ బిడ్ దాఖలకు అవకాశం కల్పించారు. ఆగస్టు 18న బిడ్ ఓపెన్ చేయనున్నారు. సెప్టెంబరు 7న ఫైనాన్షియల్ బిడ్‌ను తెరవనున్నట్టు టెండర్ నోట్‌లో పొందుపరిచారు. ఈ టెండర్‌లో పాల్గొనే సంస్థలు రూ.6.10 కోట్ల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ సమర్పించాల్సి ఉండగా.. టెండర్ ప్రాసెసింగ్ ఫీజు రూ.11,800గా నిర్ణయించారు. టెండర్ వేసే సంస్థలకు.. గతంలో విమానాశ్రయాలు నిర్మించిన, నాలుగు లేన్లకు పైబడిన జాతీయ రహదారులు లేదా ఎక్స్‌ప్రె్‌సవేల్లో భారీ పేవ్‌మెంట్ పనులు చేసిన అనుభవం ఉండాలని నిబంధన విధించారు.
అలాగే ఒకే ప్రాజెక్టులో రూ.1,627.99 కోట్ల విలువైన పని, రెండు ప్రాజెక్టుల్లో రూ.1,017.49 కోట్ల చొప్పున లేదా మూడు ప్రాజెక్టుల్లో రూ.813.99 కోట్ల చొప్పున పనులు పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. అంతేకాక.. సంస్థ సగటు వార్షిక టర్నోవర్ రూ.720.39 కోట్లు, కనీస నెట్‌వర్త్ రూ.305.24 కోట్లు, భారీ నిర్మాణ పనులు చేసిన అనుభవం వంటి ఆర్థిక, సాంకేతిక ప్రమాణాలు తప్పనిసరి చేశారు. ఆయా సంస్థల టెక్నికల్ సామర్థ్యం, గత ప్రాజెక్టుల నాణ్యత, సమయానికి పనులు పూర్తి చేసిన చరిత్ర, ఆర్థిక బలం ఆధారంగా మార్కులు కేటాయించి అర్హత పొందిన సంస్థల ఫైనాన్షియల్ బిడ్లను మాత్రమే తెరవనున్నారు. మొత్తం 100 మార్కుల మూల్యాంకన విధానాన్ని అమలు చేస్తామని టెండర్ నోట్ లో పేర్కొన్నారు. కాగా మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలో మరో టెండర్‌ను ఆహ్వానించనున్నట్టు అధికారిక వర్గాల సమాచారం.
ఐటీ, పర్యాటక రంగాలకు ఊతం..
మామూనూరు ఎయిర్‌పోర్టును హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ఏ-320 (ఎయిర్ బస్-320) లాంటి పెద్ద విమానాలు, పెద్ద కార్గో విమానాలు దిగేలా 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రన్ వే నిర్మించనున్నారు. దీన్ని భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంగానూ మార్చనున్నందున.. నిర్మాణం కోసం 949.44 ఎకరాలను కేటాయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇక, విమానాశ్రయ నిర్మాణం కాకతీయ వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేయగా.. కేంద్రం అందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ విమానాశ్రయం పనులు పూర్తయితే ఉత్తర తెలంగాణకు వైమానిక అనుసంధానం మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలకూ ఊతం లభించే అవకాశముంది.
1930లోనే వరంగల్లో ఎయిర్ పోర్టు
మామునూరులో విమానాశ్రయం 1930లో నిజాం హయాంలోనే ఏర్పాటు కాగా.. వివిధ కారణాలతో 1980లో మూతపడింది. ఎయిర్‌పోర్టు కోసం నిజాం కాలంలోనే 1,875 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిలో నుంచే నవోదయ విద్యాలయానికి 23.20 ఎకరాలు, పోలీసు శిక్షణ కేంద్రానికి 59, ఏసీపీ కార్యాలయానికి 10, సెంట్రల్ జైలుకు 101, ఫోర్త్ బెటాలియన్‌కు 241.24 ఎకరాలతోపాటు మరో 675 ఎకరాల భూమిని వెటర్నరీ వర్సిటీకి కేటాయించారు. దాంతో ఏఏఐ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఎయిర్‌పోర్టుకు అదనంగా 253 ఎకరాల భూమి కావాలని ఏఏఐ కోరడంతో.. ప్రభుత్వం ఆ భూముల సేకరణకు నిధులు మంజూరు చేసింది.