Share News

రేవంత్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:29 AM

వరంగల్‌ (మామునూరు) విమానాశ్రయం అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటనలు ‘ఉత్తర కుమార ప్రగల్భాలు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావు విమర్శించారు.

రేవంత్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు

  • వరంగల్‌ ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకునే ప్రయత్నం

  • ఆదిలాబద్‌ ఎయిర్‌పోర్టుకూ కేంద్రం ఓకే

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌ రావు

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ (మామునూరు) విమానాశ్రయం అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటనలు ‘ఉత్తర కుమార ప్రగల్భాలు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావు విమర్శించారు. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు, అభివృద్ధి క్రెడిట్‌ అంతా తమ ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రయత్నించడం హాస్యాస్పదమన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన చేశారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టు అంశంలో కేంద్ర ప్రభుత్వ కృషిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. గత కేసీఆర్‌ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మాటలు చెప్పడంలో ఎలాంటి తేడా లేదని, ఇరుపార్టీలూ అబద్ధపు వాగ్ధానాలకే పరిమితమవుతాయని ఆరోపించారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఉన్న ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం రాకూడదనే నిబంధన వరంగల్‌ విమానాశ్రయానికిపెద్ద అడ్డంకిగా మారిందన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఈ అంశంపై కేవలం ఉత్తరాలకే పరిమితమైందని తెలిపారు. కానీ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘ఉడాన్‌’ పథకంలో భాగంగా వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధన (వేవర్‌) క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం సాధించిందని వివరించారు. తెలంగాణలో గత ప్రభుత్వాలు భూసేకరణ చేయకపోవడం వల్లే వరంగల్‌ ప్రాజెక్ట్‌ ఆలస్యమైందని పేర్కొన్నారు. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌ డిఫెన్స్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రికి రాంచందర్‌ రావు హితవు పలికారు.


కాంగ్రెస్‌కు దళితులంటే ఓటు బ్యాంకే

కాంగ్రెస్‌ పార్టీ దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసి బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లను పరిరక్షించిన పార్టీ బీజేపీయేనని అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందని, మూసీ సుందరీకరణ పేరుతో పేద కుటుంబాలకు నష్టం కలిగించిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లో బీజేపీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - Jul 16 , 2026 | 06:30 AM