Share News

అసత్యాలతో వీడియోలా?

ABN , Publish Date - Mar 27 , 2026 | 03:49 AM

పంచాయితీ రాజ్‌ శాఖ గురించి శాసనసభలో జరిగిన చర్చలో సబిత, సీతక్క సంవాదం జరిగింది. గ్రామాల్లో నీటి సరఫరా సరిగా జరగడం లేదంటూ విపక్షసభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని...

అసత్యాలతో వీడియోలా?

  • వాస్తవాలనే బహిర్గత పరిచాను

  • సభలో సబిత వర్సెస్‌ సీతక్క

హైదరాబాద్‌, మార్చి26 (ఆంధ్రజ్యోతి) పంచాయితీ రాజ్‌ శాఖ గురించి శాసనసభలో జరిగిన చర్చలో సబిత, సీతక్క సంవాదం జరిగింది. గ్రామాల్లో నీటి సరఫరా సరిగా జరగడం లేదంటూ విపక్షసభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి అడ్డంకులు లేకుండా నీటి సరఫరా చేస్తుంటే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితమ్మ ఇటీవల ఓ గ్రామంలో పర్యటిస్తూ చిన్న పిల్లోడితో.. ‘కేసీఆర్‌ వెళ్లిండు.. నీళ్లు రావడం లేదు’ అంటూ అసత్య ఆరోపణలతో వీడియో చేయించారని మండిపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారగానే కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనే నిందలు వేస్తున్నారని ఆక్షేపించారు. దీనిపై సబిత స్పందిస్తూ అంతారం అనే గ్రామంలో జరిగిన వాస్తవాన్ని తాను బహిర్గతం చేశానని.. సీతక్క కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి పెరిగినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తన మీద సీఎం రేవంత్‌ కామెంట్‌ చే సే వరకు తాను ఎన్నడు కాంగ్రెస్‌ గురించి తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అప్పట్లో రాజశేఖర్‌ రెడ్డిని కొట్టడానికి తనపై ఐదు సీబీఐ కేసులు పెట్టింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క తనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ‘సీతక్క నిన్న దొరసాని అన్నారు. ఈ రోజు తనకు సంబంధం లేని ప్రసంగంలోనికి లాగారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీతక్క స్పందిస్తూ మీరు పట్టణాల్లో పుట్టిన వారని, తాము గిరిజనగూడెం నుంచి వచ్చామని, తాను మంత్రి అయినప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తూ, అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సబిత, సునీతా లక్ష్మారెడ్డి స్పందిస్తూ మంత్రి సీతక్క అంటే తమకు గౌరవమేనని, ద్వేషంతో మాట్లాడలేదని ప్రజా సమస్యలనే ప్రస్తావించడానికే ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు..

లొంగిపోయిన నక్సలైట్లు హీరోలా?

లొంగిపోయిన నక్సలైట్లను హీరోలుగా ప్రభుత్వం ఎందుకు కీర్తిస్తోందని, వారు జనజీవన స్రవంతిలోకి వచ్చినపుడు అవార్డులు, రివార్డులు ఇచ్చుకుంటే తప్పు లేదని, అయితే నక్సలైట్‌ బాధిత కుటుంబాల ఆవేదనను గమనించాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ అన్నారు. తాను నక్సలైట్‌ బాధిత కుటుంబానికి చెందిన వాడినని, మంత్రి శ్రీధర్‌ బాబు మరో నక్సలైట్‌ బాధిత కుటుంబసభ్యుడని ముఖ్యంగా హోంశాఖ ఇలాంటి వైఖరి అవలంబించడం సరైంది కాదని పేర్కొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 03:49 AM