కారుపై కూలిన గోడ.. ఇద్దరి దుర్మరణం
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:29 AM
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బుధవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టించింది. గాలివాన తీవ్రతకు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలి కారుపై పడగా.. ఆ కారు నుజ్జునుజ్జు అయ్యి అందులో ఉన్న ఇద్దరు మరణించారు.
మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన ఇంజనీర్
మరొకరు పశ్చిమ బెంగాల్ వాసి
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఘటన
దేవరకద్ర/గద్వాల, జూన్ 17 (ఆంద్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బుధవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టించింది. గాలివాన తీవ్రతకు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలి కారుపై పడగా.. ఆ కారు నుజ్జునుజ్జు అయ్యి అందులో ఉన్న ఇద్దరు మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన జగన్నాథ్‌రెడ్డి (43) అనే ఇంజనీర్.. భారత్‌మాల రహదారి సర్వే పనుల నిమిత్తం కొద్ది నెలల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చారు. దేవరకద్రలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయితే, బుధవారం సాయంత్రం పనులు ముగించుకొని కారు (బొలెరో)లో ఇంటికి బయలుదేరారు. కానీ భారీ వర్షం కురుస్తుండటంతో వాహన డ్రైవర్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంతోష్ (42) కారును నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ముందు ఆపాడు. జగన్నాథ్‌రెడ్డి, డ్రైవర్ సంతోష్ వాహనంలోనే కూర్చొన్నారు. అదే సమయంలో ఆ ఇంటి రెండో అంతస్తులోని గోడ కూలి కారుపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జవ్వగా.. జగన్నాథ్‌రెడ్డి, సంతోష్ తీవ్రంగా గాయపడి, అందులోనే చిక్కుకుపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారుపై పడిన గోడ శిథిలాలను స్థానికుల సాయంతో తొలగించి.. జగన్నాథరెడ్డి, సంతోష్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే ఇరువురు మరణించారు.
దేవరకద్రలో నిలిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్
ఈదురుగాలుల బీభత్సం వల్ల దేవరకద్ర రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ వేపచెట్టు కొమ్మ విరిగి రైలు పట్టాలపై పడింది. మరోవైపు, సాయంత్రం 5 గంటల సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న తుంగబద్ర ఎక్స్‌ప్రైస్ రైలు పైభాగంలో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో రైలును అక్కడే నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి రైల్వే ఇంజనీర్లు వచ్చి సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రెండు గంటల అనంతరం రాత్రి 7 గంటల సమయంలో రైలు హైదరాబాద్‌కు బయలుదేరింది.
శ్రీశైలం జలాశయానికి 6,710 క్యూసెక్కుల వరద
కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు సుంకేసుల బ్యారేజీ నుంచి నీటి విడుదలతో శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రారంభమైంది. బుధవారం 6,710 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా. ప్రాజెక్టులో 41.69 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జూరాల ప్రాజెక్టుకు 2 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1,500 క్యూసెక్కులు, భీమాకు 1,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం జూరాలలో 7.49 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఈ సమయానికి కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కగా ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా మారింది.