Share News

kumaram bheem asifabad- నడకే..నరకం

ABN , Publish Date - Jul 31 , 2026 | 10:18 PM

జిల్లాలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు బురదమయంగా మారడంతో ప్రజలు కాలినడక వెళ్లేందుకు సైతం తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. చినుకు పడితే చాలు రోడ్లు చిత్తడిగా మారి ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో మారు మూల గ్రామాలు నేటికి కనీసం రహదారులకు నోచుకోని దుస్థితి నెలకొంది.

kumaram bheem asifabad- నడకే..నరకం
బురదలో నుంచి కాలినడకన వస్తున్న హీరాపూర్‌ గ్రామస్తులు (పైల్‌)

- అత్యవసర పరిస్థితుల్లో మరిన్ని ఇబ్బందులు

- రాకపోకలకు మారుమూల గ్రామాల ప్రజల తీవ్ర అవస్థలు

ఆసిఫాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు బురదమయంగా మారడంతో ప్రజలు కాలినడక వెళ్లేందుకు సైతం తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. చినుకు పడితే చాలు రోడ్లు చిత్తడిగా మారి ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో మారు మూల గ్రామాలు నేటికి కనీసం రహదారులకు నోచుకోని దుస్థితి నెలకొంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వర్షం వస్తే చాలు భయంగుప్పిట్లో మగ్గాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి నాటు వైద్యంను ఆశ్రయించాల్సిన వస్తుంది. దీంతో ఒక్కో సారి ప్రాణాలు గాలిలో కలిసి పోయిన సంఘటనలు ఉన్నాయి. గ్రామాల్లో డయేరియా, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులు ప్రబలినట్లయితే గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు 104, 108 వాహనాలు సైతం వెళ్లలేని దయనీయ దుస్థితి నెలకొంది. పాలకులు ప్రతిసారి హామీ ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. గత నాలుగు రోజులుగా జిల్లా అంతట కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదమయం కావడంతో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు అవస్థలు పడుతున్నారు.

- ఏళ్లుగా మారని దుస్థితి..

జిల్లాలో ఏళ్లుగా రోడ్ల పరిస్థితి మారడం లేదు. వందలాది గ్రామాలు వాగులు, వంకల గుండా, అడవుల గుండా ప్రయాణించాల్సిన దుస్థితి దాపురించింది. దాంతో గిరిజన గూడాలన్ని అభివృద్ధి వెలుగులకు దూరంగా విద్య, అంటువ్యాధులు వం టి తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లతో పాటు అంతర్గత రహదారుల వ్యవస్థ సరిగ్గా లేక పోవడంతో నేటికీ పల్లెలు అభివృద్ధి నోచుకోవడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన అధ్యాయనంలో మొత్తం 335 గ్రామ పంచాయతీల పరిధిలోని 449 గిరిజన గూడాలకు అసలే రోడ్డు సౌకర్యం లేనట్లుగ గుర్తించారు. ఇందులో ఆసిఫాబాద్‌ నియోజక వర్గానికి సంబంధించి అత్యధికంగా 305 గ్రామాలు ఉండగా సిర్పూర్‌ నియోజక వర్గంలో 144 గ్రామాలకు రోడ్ల నిర్మాణం జరగాల్సి ఉన్నట్లు గుర్తించారు.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలో 15 మండలాల పరిధిలోనూ రోడ్ల పరిస్థితి ఇప్పటికీ మారడం లేదు. చిన్న పాటి వర్షానికే రోడ్లన్ని చిత్తడిగా మారి నడవడానికి సైతం వీలు లేకుండా పోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్‌ మండలంతో పాటు వాంకిడి , కెరమెరి, రెబ్బె న, జైనూర్‌ , సిర్పూర్‌(యు) , తిర్యాణి, లింగాపూర్‌, కాగజ్‌నగర్‌ , బెజ్జూరు ,దహెగాం ,పెంచికలపేట, సిర్పూర్‌(టి) మండలాలలో రోడ్లు పూర్తిగా అధ్వాన్నంగా మారాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రతినిత్యం రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో బురదలోనే నడుచుకుంటూ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. జిల్లాలో గ్రామీణ రోడ్ల దుస్థితి దయనీయంగా దర్శణమిస్తున్నా అటు పాలకులు కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోవం లేదు. దీంతో ఏటా వర్షాకాలంలో ప్రజలు నానా అవస్థలు పడాల్సి దుస్థితులు తలెత్తుతున్నాయి. గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకునే నాథుడే కరువుడయ్యాడని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా రహదారులు..

- దుర్గం దినకర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు

జిల్లాలో గ్రామీణ రహదారుల వ్యవస్థ పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. వర్షాలు కురుస్తె చాలు రోడ్లు పూర్తిగా బురదమయంగా మారి నడవడానికి సైతం వీలులేకుండా పోతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామీణ రహదారులను మెరుగుపర్చడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jul 31 , 2026 | 10:18 PM