ఎంసీహెచ్‌ఆర్‌డీలో వీవీఐపీ వసతి గృహం చుట్టూ ప్రహరీ నిర్మాణం
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:37 AM
ఎంసీహెచ్‌ఆర్‌డీ ఆవరణలో నిర్మిస్తున్న వీవీఐపీ అతిథి గృహానికి భద్రతాపరమైన చర్యల్లో భాగంగా ప్రహరీ నిర్మించేందుకు రూ.9.08 కోట్ల అంచనాలతో రహదారులు.....
రూ.9.08 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచిన ఆర్‌అండ్‌బీ
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్ర జ్యోతి): ఎంసీహెచ్‌ఆర్‌డీ ఆవరణలో నిర్మిస్తున్న వీవీఐపీ అతిథి గృహానికి భద్రతాపరమైన చర్యల్లో భాగంగా ప్రహరీ నిర్మించేందుకు రూ.9.08 కోట్ల అంచనాలతో రహదారులు, భవనాల శాఖ టెండర్లు పిలిచింది. వీవీఐపీలు బస చేసేందుకు, నగరానికి వచ్చే ప్రముఖులతో సీఎం సమావేశం అయ్యేందుకు వీలుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదే భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా కూడా వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, కాన్సర్టినా వైర్ ఏర్పాటు, కంటైనర్లు, వాచ్ టవర్ల నిర్మాణం, గేట్లు, కార్యాలయ ఫర్నిచర్, ఇతర భద్రతా సదుపాయాల కల్పన పనులు చేసేందుకు కాంట్రాక్టర్లను ఆహ్వానిస్తూ రహదారులు, భవనాల శాఖ సోమవారం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో నమోదై ఉన్న కాంట్రాక్టర్లు ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖలు చేయాలి. సాంకేతిక బిడ్ల పరిశీలన ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన పత్రాల ఆధారంగానే జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఎంపికైన కాంట్రాక్టర్ ఒప్పందానికి ముందు అసలు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.