kumaram bheem asifabad-ఓటరు గణన ఫారం...పూర్తి చేద్దాం ఇలా..
ABN , Publish Date - Jun 28 , 2026 | 10:15 PM
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -2026 (ఎస్‌ఐఆర్)కీలకమైన భాగం ఎన్యూమ రేషన్ (గణన) ఫారం పూరించడం. ప్రస్తుతం అధికారులు ఆ ఫారాలను అంజేస్తుండగా అందులో ఏయే అంశాలు నింపాలి, ఏయే పత్రాలు జత చేయాలి లాంటి అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
- జత చేయాల్సిన ధ్రువపత్రాలు తప్పనిసరి
- ఓటర్ల పూర్తి వివరాలు నమోదు చేయాలి
వాంకిడి/బెజ్జూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -2026 (ఎస్‌ఐఆర్)కీలకమైన భాగం ఎన్యూమ రేషన్ (గణన) ఫారం పూరించడం. ప్రస్తుతం అధికారులు ఆ ఫారాలను అంజేస్తుండగా అందులో ఏయే అంశాలు నింపాలి, ఏయే పత్రాలు జత చేయాలి లాంటి అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అసలు గణన ఫారంలో ఎన్ని భాగాలు ఉంటాయి ? వాటిల్లో ఏయే వివరాలు నింపాలి? అన్న అంశాలపై అవగాహన ఉండాలి.
- ఒకటో భాగం..
భారత ప్రభుత్వ ఎన్నికల అధికారి జారీచేసిన గణన ఫారంలో మూడు భాగాలుగా విభజించారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన గణన ఫారంలోని మొదటి భాగంలో మీ వివరాలు అన్నీ ముద్రించబడి ఉంటాయి. ఫారం కుడి పక్కగడిలో మీ ప్రస్తుత పొటో తప్పనసరి అతికించాలి.
- రెండో భాగం ఇలా...
ఈ రెండో భాగం రెండు బాక్సులుగా ఉంటుంది. 2002 నాటికి మీకు ఓటు ఉంటే 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్‌ని పూరించాలి. అంటే ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, బంధువు పేరు, వారితో మీకున్నటువంటి బంధుత్వం, జిల్లా పేరు, రాష్ట్రం శాసనసభ నియోజకవర్గం పేరు పూరించాలి. 2002 నాటి ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గ సంఖ్య, భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ నెంబరు, క్రమసంఖ్య అంటే ఓటరు లీస్టులో మీ సీరియల్ నెంబర్ వేయాలి. ఒకవేళ 2002 ఓటరు జాబితాలో మీ పేరు నమోదు లేని పక్షంలో పక్కనున్నబాక్స్‌ని నింపాలి. అందులో మీతండ్రి, తల్లి, తాత, నాయనమ్మలలో ఎవరో ఒకరి వివరాలు2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారం పూరించాలి. ఓటరు పొటో గుర్తింపు కార్డు అంటే వారి ఒటరు గుర్తింపు కార్డు నెంబరు వేయాలి. బంధువు పేరు అంటే వారి తండ్రి లేదా భర్త పేరు రాయాలి. బంధుత్వం అని ఉన్న చోట తండ్రి, వివాహిత స్త్రీ అయితే భర్త, జిల్లా, రాష్ట్రం శాసనసభ నియోజకవర్గ పేరు పూరించాలి. అదే బాక్స్ కింద భాగాన 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గ సంఖ్య భాగం, సంఖ్య అంటే పోలింగ్‌స్టేషన్ నెంబర్, క్రమసంఖ్య అంటే ఓటరు లిస్టులో మీ సిరియల్ నెంబర్ ఎంత అనేది వేయాలి. తెలంగాణలోనే కాకుండా భారత దేశంలో ఎక్కడ ఉన్నా వారి గత 2002 నాటి ఎస్‌ఐఆర్‌లో ఇవ్వబడిన ఓటర్ల జాబితా వివరాలు చేర్చాలి.
- మూడో భాగంలో...
ఈ భాగంలో ఓటరు యోక్క ప్రస్తుత పూర్తి వివరాలు చేర్చాలి. అంటే పుట్టిన తేదీ, ఆధార్‌నంబర్, మొబైల్ నెంబర్, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, తండ్రి లేదా సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, తల్లి పేరు, తల్లి గుర్తింపు కార్డు నెంబరు, పెళ్లి అయితే భాగస్వామి యొక్క గుర్తింపు కార్డు నెంబరును వేయాలి. మీ భాగస్వామి పేరు అవకపోతే ఖాళీగా వదిలిపెట్టాలి. మీ భాగస్వామి యొక్క గుర్తింపుకార్డు నెంబరును వేయాలి. మీకు 2002 నాటి ఓటర్ వివరాలు తెలియకపోతే వాటి సమాచారం కోసం వెబ్‌సైట్‌లో ఓటర్స్.ఈసీఐ.ఇన్‌లో కూడా చూడొచ్చు. ఈ వెబ్‌సైట్లో వివరాలు లభించకపోతే గణన ఫారం రెండో భాగంలోని ఒకటవ మరియు రెండవ బాక్సులను ఖాళీగా వదిలేసి మూడవ భాగంలోని వివరాలు పుట్టిన తేదీ ప్రకారం ఈ క్రింద తెలిపిన పత్రాలను ఫారంతో పాటు బీఎల్‌వోలకు తప్పకుండా అందజేయాలి.
వివరాలు దొరకకపోతే..
ఓటర్లు తమ 2002 నాటి వివరాలు దొరకకపోతే ఇలా చేయల్సి ఉంటుంది. 1987 జూలై 1వ తేదీకి ముండు పుట్టిన వారు తమ సొంత సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 1వ తేదీ నుంచి 2004 డిసెంబరు 2 మధ్యలో పుట్టిన వారు తమ ధ్రువపతత్రాలతో పాటు తల్లి లేదా తండ్రితో ఎవరో ఒకరి సర్టిఫికెట్ జతచేయాలి. 2004 డిసెంబరు 2 తర్వాత పుట్టిన యువ ఓటర్లు అయితే సొంత సర్టిఫికెట్ పాటు తల్లిదండ్రుల సర్టిఫికెట్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.