ఓటరూ జాగ్రత్త..
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:09 AM
బోగస్ ఓట్లు తొలగించి ఎలాంటి లోపాలు లేకుండా సమగ్రమైన ఓటర్ జాబితాను రూపొందించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన ప్రారంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. మరోవైపు రాజకీయ పార్టీలు, ఓటర్లలో అలజడి
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
బోగస్ ఓట్లు తొలగించి ఎలాంటి లోపాలు లేకుండా సమగ్రమైన ఓటర్ జాబితాను రూపొందించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన ప్రారంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. మరోవైపు రాజకీయ పార్టీలు, ఓటర్లలో అలజడి మొదలైంది. ఇప్పటికే జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్ చేసిన క్రమంలోనే ఓటర్ల వివరాలలో భారీగా వ్యత్యాసాలు బయటపడుతున్నాయి. ఈనెల 25 నుంచి జూలై 24వ తేది వరకు ఇంటింటికి బీఎల్‌వోలు వెళ్లి వివరాలు సేకరిస్తారు. తుది ఓటర్ జాబితాను అక్టోబర్ 1న ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఈక్రమంలో ఓటర్ జాబితా సరిదిద్దే క్రమంలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందిస్తారు. ఫారం నింపి ఇస్తేనే జాబితాలో పేరు ఉంటుందని స్పష్టమవుతోంది. ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా నిర్వహించే దిశగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బీఎల్‌వోలకు శిక్షణ అందించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అవగాహన కల్పించారు. మరోవైపు ప్రధాన పార్టీలు జాబితాలో ఓటర్లు తొలగిపోకుండా దృష్టి పెట్టారు. పార్టీ ఇన్‌చార్జిలను అప్రమత్తం చేసి అందరూ ఓటరుగా ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 4,75,694 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 4,04,441 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసారు. 71,203 మంది ఓటర్లు అన్‌మ్యాపింగ్‌లో ఉన్నారు. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో 82.48 శాతం, వేములవాడలో 87.76 శాతం పూర్తి చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగళ్ళపల్లి, ముస్తాబాద్ మండలాల్లో 2,46,562 మంది ఓటర్లు ఉండగా, 2,03,366 ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేశారు. 43,196 మంది ఓటర్లు అన్‌మ్యాపింగ్‌లో ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో మేడిపల్లి, భీమారం, కథలాపూర్, రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, కోనరావుపేట మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,29,132 మంది ఓటర్లు ఉండగా 2,01,075 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేశారు. 28,057మంది ఓటర్లు అన్‌మ్యాపింగ్‌లో ఉన్నారు.
రికార్డుల్లో తేడా ఉన్న ఓటర్లు 1.71లక్షల మంది
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్ మ్యాపింగ్ సమయంలోనే రికార్డుల్లో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. దీంతో జిల్లాలో భారీగానే ఓటర్లు తొలగిపోతారని చర్చ జరుగుతోంది. ప్రీ- ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో జిల్లాలో ఓట్ల రికార్డుల్లో తేడాలతో 1,71,203మంది ఉన్నారు. అనామాలిస్ కింద ఫ్లాగ్ చేసి పెట్టారు. బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ కోసం వచ్చినప్పుడు వారు అందించే ఫారంలో వివరాలు ఇవ్వని పక్షంలో ఓటర్‌గా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. 2002 ఓటర్ జాబితా 2025 ఓటర్ జాబితాతో పోల్చినప్పుడు ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లల వయస్సు, తోబుట్టువుల మధ్య కూడా వ్యత్యాసాలు ఉండడంతో ఫ్లాగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఫ్లాగ్ చేసిన ఓటర్లలో సిరిసిల్లలో 63,127 మంది వేములవాడలో 54,734 మంది ఉన్నారు.
ఎన్యూమరేషన్ ఫారం నింపితేనే జాబితాలో పదిలం
బీఎల్‌వోలు గురువారం నుంచి ప్రతి ఇంటికి మూడుసార్లు వస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి ముందుగా ఎన్యూమరేషన్ ఫారం అందిస్తారు. దానిని తిరిగి సేకరించి మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. 12 పేజీలతో కూడిన ఈ ప్రత్యేక ఫారాన్ని నింపి అందించే క్రమంలో బీఎల్‌వో ఇంటికి వెళ్లిన సమయంలో డోర్ లాక్ చేసి ఉంటే ఆ ఇంటిని మూడుసారి సందర్శిస్తారు. మూడోసారి కూడా తాళం వేసి ఉంటే అక్కడే ఫోన్ నంబర్‌తో పాటు సూచనలు రాసి ఉంచుతారు. నిబంధనల ప్రకారం లేకుండా తేడాలు ఉంటే వీఆర్వో స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఓటు హక్కు కోల్పోకుండా ఓటర్లు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు వలస ఓటర్లలో భయం వెంటాడుతోంది. జిల్లాలో ఎక్కువ మంది కార్మికులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. మరోవైపు ఓటు హక్కు కలిగిన విద్యార్థులు అమెరికా, లండన్‌లాంటి దేశాల్లో ఉండిపోయారు. వీరి ఓట్లపై కూడా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం మూడు దశల్లో ఓటరు జాబితా ప్రక్రియ జరుగుతుందని ఆందోళన చెందవద్దని ప్రకటిస్తున్నారు.
ఇదీ షెడ్యూల్..
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలతోపాటు అన్ని గ్రామాల్లో ఎస్‌ఐఆర్‌లో భాగంగా జూన్ 25నుంచి జూలై 24వరకు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 15 నుంచి 24 వరకు సన్నాహక సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 25నుంచి జూలై 24వరకు ఇంటింటి సర్వే, జూలై 24నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 31న ఓటర్ జాబితా ముసాయిదా వెల్లడిస్తారు. అదేరోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరిస్తారు. తుది ఓటర్ జాబితాను అక్టోబర్ 1వ తేదినవెల్లడిస్తారు. ఓటర్ జాబితాలో చనిపోయిన వారు, డూప్లికేట్, శాశ్వతంగా వలసపోయిన వారు, అనర్హుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు.
చివరిసారిగా 2002లో సర్వే
ఓటర్ జాబితా ప్రక్షాళన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో ఎస్‌ఐఆర్ సర్వే జరిగింది. అప్పటి ఓటర్ జాబితాతో పాటు 2025 ఓటర్ జాబితాను బీఎల్‌వోలకు అందించి దీని ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్లి పాత లిస్టులోని పేర్లు కొత్త జాబితాలోను ఉంటే మ్యాపింగ్ చేస్తున్నారు. వారి సంతాన వివరాలను కూడా సేకరిస్తున్నారు. కుటుంబీకుల పేర్లు జాబితాలో ఉంటే మ్యాపింగ్ చేస్తున్నారు. ప్రతి బూత్‌స్థాయి అధికారులు 2025 ఓటర్ జాబితాలోని 40ఏండు,్ల ఆపైన ఉన్న వారి ఓటర్లను 2002 ఓటర్ జాబితాలో గుర్తించి బీఎల్‌వోలు యాప్‌లో అప్డేట్ చేస్తున్నారు. తర్వాత వారి పిల్లల పేర్లను వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఓటర్ జాబితా మ్యాపింగ్ సర్వేలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎస్‌ఐఆర్ సర్వే తర్వాత ఓటర్లు జిల్లాలో తగ్గిపోతారని భావిస్తున్నారు.
ఓటర్ జాబితా మ్యాపింగ్ లెక్క ఇది
సిరిసిల్ల నియోజకవర్గం
మండలం మొత్తం ఓటర్లు మ్యాపింగ్ అయినవారు మ్యాపింగ్ కానివారు అనామలీస్ శాతం
వీర్నపల్లి 11,606 10,722 884 2,660 92.38
ఎల్లారెడ్డిపేట 40,195 34,621 5,574 9,833 86.13
గంభీరావుపేట 36,737 32,461 4,276 8,151 88.36
సిరిసిల్ల 80,541 58,948 21,593 21,259 73.19
తంగళ్ళపల్లి 39,569 32,353 7,216 10,335 8176
ముస్తాబాద్ 37,914 34,261 3,653 10,889 90.37
---------------------------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 2,46,562 2,03,366 43,196 63,127 82.48
---------------------------------------------------------------------------------------------------------------------------------------------
వేములవాడ నియోజకవర్గ
మండలం మొత్తం ఓటర్లు మ్యాపింగ్ అయినవారు మ్యాపింగ్ కానివారు అనామలీస్ శాతం
మేడిపల్లి 24,535 21,347 3,188 4,952 87.01
భీమారం 17,744 15,280 2,464 4,040 86.11
కథలాపూర్ 38,184 32,185 5,999 7,473 84.29
రుద్రంగి 8,699 8,499 200 3,438 97.70
చందుర్తి 28,257 25,751 2,506 7,276 91.13
వేములవాడ రూరల్ 18,998 17,686 1,312 4,129 93.09
వేములవాడ అర్బన్ 58,143 48,931 9,212 16,880 84.16
కోనరావుపేట 34,572 31,396 3,176 6,546 9081
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 2,29,132 2,01,075 28,057 54,734 87.76
--------------------------------------------------------------------------------------------------------------------------------------------