పోలీసులపై దాడి.. పచ్చి అబద్ధం
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:53 AM
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలో పోలీసులపై దాడులు జరిగాయనడం పచ్చి అబద్ధమని సీజేపీ వలంటీర్లు రుచిత్ ఆశాకమల్, విజయ్ మల్లంగి పేర్కొన్నారు.
ఉద్యమానికి ఎంతో మంది మద్దతిచ్చారు
క్రౌడ్ కంట్రోలింగ్.. పెద్ద సవాల్‌గా మారింది
నీట్ విద్యార్థిని సనా ఆత్మహత్య కలిచివేసింది
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. సీజేపీ విజయం
‘ఆంధ్రజ్యోతి’తో సీజేపీ వలంటీర్లు రుచిత్, విజయ్
హైదరాబాద్‌సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలో పోలీసులపై దాడులు జరిగాయనడం పచ్చి అబద్ధమని సీజేపీ వలంటీర్లు రుచిత్ ఆశాకమల్, విజయ్ మల్లంగి పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లి నిరసనలో పాల్గొన్న వారిద్దరినీ ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను వారు పంచుకున్నారు. తెలంగాణలో నిరసనల నిర్వహణ కమిటీ కోఆర్డినేటర్‌గా వ్యవహరించిన రుచిత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలోనే సోనమ్‌వాంగ్ చుక్‌తో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపారు. హైదబాద్‌లో నీట్ విద్యార్థిని షేక్ సనా ఆత్మహత్య చేసుకోవడం ఎంతగానో కలిచివేసిందని, ఆమె తల్లిదండ్రులను తానే ఢిల్లీకి తీసుకెళ్లానని వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సీజేపీ విజయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి తనతోపాటు అశోక్, అన్సార్ వలంటీర్లుగా పని చేశారని, గురుద్వారాలో ఒక రోజు, పార్కులో ఒకరోజు.. ఇలా అక్కడే తిని, అక్కడే పడుకునేవాళ్లమని చెప్పారు. ఒక సారి సీజేపీతో సంబంధం లేని 40మంది అపరిచితుల గుంపు కర్రలు పట్టుకొని పోలీసులపైకి వెళ్తుంటే...తామే అడ్డగించామన్నారు. కానీ, ఢిల్లీ పోలీసులంత కర్కోటకులను ఇంతవరకు తానెక్కడా చూడలేదని రుచిత్ చెప్పారు. చలో పార్లమెంట్‌ను అడ్డుకోడానికి విద్యార్థులపై లాఠీచార్జి చేశారని, టియర్‌గ్యాస్ ప్రయోగించారని, మేకులు కొట్టిన కర్రలతో చావబాదారని వివరించారు. ఇవన్నీ భరించలేక ఒకరిద్దరు ఎదురుతిరిగి ఉంటారేమో గానీ.. పోలీసులపై నిరసనకారులు దాడి చేశారనడం అబద్ధమని స్పష్టం చేశారు.
సీజేపీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని తెలుగు సినీ రంగ ప్రముఖులందరినీ సామాజిక మాధ్యమాల ద్వారా కోరినా స్పందించలేదని తెలిపారు. దర్శకులు శేఖర్ కమ్ముల, వేణు ఉడుగుల మాత్రమే మద్దతు తెలిపారని వివరించారు. మరో వలంటీర్ విజయ్ మాట్లాడుతూ వాంగ్‌చుక్ దీక్ష మొదలైనప్పటి నుంచి ఆయనకు సహాయకుడిగా వ్యవహరించానని తెలిపారు. చలో పార్లమెంట్ ముందు రోజు వరకు సభాస్థలిలో మద్దతుదారుల సంఖ్య వెయ్యి నుంచి రెండు వేలమంది లోపే ఉందని, ఆ తర్వాత నుంచి వేల మంది తరలిరావడంతో క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. జంతర్‌మంతర్ దగ్గర 1060మంది వలంటీర్లు.. రోజుకు 16-18గంటలు పని చేశారని తెలిపారు. విదేశీ నిధులతో ఉద్యమిస్తున్నారంటూ విద్యార్థుల పోరాటంపై విషం చిమ్మారని, కానీ, దాతల విరాళాలతోనే పోరాటం సాగిందని తెలిపారు. ఎంతో మంది నీళ్లు, ఆహార పొట్లాలను పంపారని వెల్లడించారు.