Municipal Elections: సంక్రాంతికి ముందే మునిసిపల్ షెడ్యూల్
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:15 AM
రాష్ట్రంలో పురపాలికల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సంక్రాంతి పండుగకు మూడు రోజులు ముందుగానే ప్రకటించే .....
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పురపాలికల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సంక్రాంతి పండుగకు మూడు రోజులు ముందుగానే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే 117 మునిసిపాలిటీలు, 6 మునిసిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీని షెడ్యూల్ ప్రకారం సిద్ధంచేస్తోంది. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. పురపాలికల్లో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని, కార్యదర్శి మంద్ మకరంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతో బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేయాలని కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 12న అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని, 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణ.. ఆ వెంటనే ‘టీ-పోల్’ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. 16న ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించాలని ఆదేశించారు.