Virtual FIR Filing via WhatsApp with AI Assistance: స్టేషన్ మెట్లు ఎక్కకుండానే.. వాట్సా్‌పలో ఎఫ్‌ఐఆర్!
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:22 AM
ఇటీవల ఇంటర్నెట్ వాడకం పెరిగినట్లే సైబర్‌నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. చాలామంది తెలియకుండానే సైబర్ నేరస్తుల...
సైబర్ బాధితులకు అండగా ‘సీ-మిత్ర’.. ఏఐ సాయంతో ఫిర్యాదు సిద్ధం
దేశంలోనే తొలిసారిగా వినూత్న ప్రయోగం
రంగంలోకి 24మంది వర్చువల్ పోలీసులు
వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఇటీవల ఇంటర్నెట్ వాడకం పెరిగినట్లే సైబర్‌నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. చాలామంది తెలియకుండానే సైబర్ నేరస్తుల బారిన పడి రూ. లక్షలు నష్టపోతున్నారు. ఇలా సైబర్ దాడులకు గురైనవారు ఎక్కడ ఫిర్యాదు చేయాలో, ఎలా ఫిర్యాదు చేయాలో తెలీక సతమతమవుతున్నారు. అలాగే, పోలీ్‌సస్టేషన్ల చుట్టూ తిరగాల్సిరావడం మరో సమస్యగా మారింది. బాధితులు పోలీసుల వద్దకు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ‘సీ-మిత్ర’ పేరుతో బషీర్‌బాగ్ సీసీఎ్‌సలోని సైబర్ క్రైమ్ విభాగంలో వర్చువల్ హెల్ప్‌డె్‌స్కను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ శుక్రవారం ప్రారంభించారు. పోలీసులే బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదు తీసుకోవడం మొదలూ, ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తవుతుందని సీపీ అన్నారు.
80ు నేరాలు రిజిస్టర్ కావడంలేదు.. సీపీ
జాతీయ సైబర్ పోర్టల్‌కు వచ్చే ఫిర్యాదుల్లో కేవలం 18 శాతం మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయని, మిగిలిన 82 శాతం నమోదు కావడంలేదని సజ్జనార్ వెల్లడించారు. ఇకపై, సైబర్ పోర్టల్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ‘సి-మిత్ర’ విధానం ద్వారా రూ. 3 లక్షల లోపు ఉన్న మోసాలను జీరో ఎఫ్‌ఐఆర్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తామని, అంతకు పైబడిన కేసులను సైబర్ క్రైం నేరుగా విచారిస్తుందని చెప్పారు.
ఏమిటీ సీ-మిత్ర ?
సాధారణంగా సైబర్ మోసం జరిగినప్పుడు బాధితులు 1930 నంబర్‌కు లేదా జాతీయ సైబర్ పోర్టల్‌లో గానీ ఫిర్యాదు చేస్తారు. అయితే, ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం కచ్చితంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ‘సీ-మిత్ర’ ద్వారా బాధితులు పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లే అవసరం ఉండదు. తమ ఇంటి నుంచే వాట్సా్‌పలో ఏఐ సాంకేతికతతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. హెల్స్ డెస్క్ పనితీరును అడిషనల్ సీపీ శ్రీనివాస్ సమగ్రంగా వివరించారు. ఫిర్యాదులో ఏం రాయాలి? ఏ పత్రాలు జత చేయాలి..? ఏయే సెక్షన్లు వర్తిస్తాయి? అంటూ బాధితులకు అనేక సందేహాలు మెదులుతుంటాయని, అటువంటి వారికి ‘సీ-మిత్ర’ బృందమే స్వయంగా ఫోన్ చేసి, వివరాలు సేకరించి ఫిర్యాదు పత్రాన్ని సిద్ధం చేసి బాధితులకు పంపిస్తుందని తెలిపారు. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపిస్తే సరిపోతుంది అన్నారు. లేదంటే సైబర్ క్రెం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న డ్రాప్ బాక్స్‌నూ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 24 మంది శిక్షణ పొందిన వర్చువల్ పోలీసు అధికారులను హెల్ప్ డెస్క్‌లో నియమించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ పరిధిలో నివసిస్తున్న సైబర్ నేర బాధితులు మాత్రమే సి-మిత్ర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
డిజిటల్ దొంగలకు.. వర్చువల్ చెక్
డిజిటల్ అరెస్టుల పేరుతో నకిలీ పోలీసులు మోసం చేస్తున్న తరుణంలో.. సీ-మిత్ర విషయంలో అలాంటి భయాలు పెట్టుకోవద్దని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. అసలైన పోలీసులను గుర్తించే విధానాన్ని సీపీ వివరించారు. బాధితులకు 040-4189-3111 అనే అధికారిక నంబరు నుంచే కాల్ వస్తుందని, ఎఫ్‌ఐఆర్ నమోదు కాగానే 87126 సిరీ్‌సతో ప్రారంభం అయ్యే పోలీసుల అఫీషియల్ వాట్సాప్ నుంచి మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ను పంపిస్తారని వివరించారు. ఈ వర్చువల్ పోలీసులు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉంటారని, సజ్జనార్ తెలిపారు.