Farmer Death in Suryapet: పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:14 AM
రైతు మృతదేహంతో తొమ్మిది గంటల పాటు కొనసాగిన ఆందోళన.. అర్ధరాత్రి వేళ ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లిలో ...
రైతు మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత
దాడి ఘటనలో 22 మందిపై కేసు నమోదు
రైతు మృతికి కారకులైన 10 మందిపై కేసు
సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి వేళ ఘటన
తుంగతుర్తి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రైతు మృతదేహంతో తొమ్మిది గంటల పాటు కొనసాగిన ఆందోళన.. అర్ధరాత్రి వేళ ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లిలో 50మంది పోలీసు సిబ్బందిపై గ్రామస్థులు రాళ్లు, కర్రలు, కారం పొడితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రావులపల్లికి చెందిన రైతు జోగునూరి లాజరస్(67) కొన్నేళ్ల క్రితం కేతిరెడ్డి విజయసేన్‌రెడ్డి, సౌజన్యరెడ్డి దంపతులకు చెందిన భూమిని కొనుగోలు చేశారు. 1995లో విజయసేన్‌రెడ్డి మృతి చెందగా ఆయన భార్య సౌజన్యరెడ్డి అమెరికా వెళ్లారు. కొద్దికాలం కిందట అమెరికా నుంచి వచ్చిన సౌజన్యరెడ్డి భూమిని తాము విక్రయించలేదని మొత్తం 42 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. ఆమె వద్ద ఉన్న ఆధారాల మేరకు ఐదు ఎకరాల భూమికి ఇటీవల పట్టా ఇవ్వగా, ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. నోటీసులు అందుకున్న వారిని సోమవారం పోలీసులు విచారించారు. అక్కడికి వచ్చిన జోగునూరి లాజరస్(67) కుప్పకూలి మృతి చెందారు. లాజరస్ మృతికి సౌజన్యరెడ్డే కారణమని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు సోమవారం మధ్యాహ్నం 3గంటలనుంచి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసన్నకుమార్ రావులపల్లికి చేరుకుని నచ్చజెప్పే యత్నం చేసినా.. వారు వినిపించుకోలేదు. పోస్టుమార్టం కోసం రాత్రి 12గంటల సమయంలో మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై కొందరు రాళ్లు, కర్రలు, కారంపొడితో దాడి చేశారు. ఈ ఘటనలో అర్వపల్లి, మద్దిరాల, నాగారం ఎస్సైలు సైదులు, వీరన్న, చిరంజీవి, ఏఆర్ కానిస్టేబుల్ సందీప్, మహిళా కానిస్టేబుళ్లు త్రివేణి, విజయలక్ష్మి, స్వాతికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, రైతు మృతి ఘటనలో సౌజన్యతోపాటు 10మందిపై కేసులు నమోదు చేశామని సీఐ నరసింహారావు తెలిపారు. పోలీసులపై దాడికి పాల్పడిన 22 మందిపైనా కేసులు పెట్టామన్నారు.