Share News

kumaram bheem asifabad- మార్కెట్‌లో వినాయక చవితి సందడి

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:28 PM

మార్కెట్‌లో ఆదివా రం వినాయక చవితి సామగ్రి కొనుగోళ్ల సందడి పందుకుంది. సామగ్రిని రెండురోజుల ముందునుంచే కొనుగోలు చే యగా వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పత్రి, వినాయక ప్రతిమల,పూలను జోరుగా అమ్మారు. ప్రజలు పూజా సామగ్రి కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. బిల్వ, మాచీ, ఆచూత, మారేడు లాంటి 21 రకాల పత్రి, తామరాకులు, వెలగపండ్లు, మారెడు కాయలు, కంకులు, పెసరకాయ లాంటి వాటిని కొనుగోలు చేశారు

kumaram bheem asifabad- మార్కెట్‌లో వినాయక చవితి  సందడి
ఆసిఫాబాద్‌లో పూజ సామగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌/సిర్పూర్‌(టి), సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో ఆదివా రం వినాయక చవితి సామగ్రి కొనుగోళ్ల సందడి పందుకుంది. సామగ్రిని రెండురోజుల ముందునుంచే కొనుగోలు చే యగా వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పత్రి, వినాయక ప్రతిమల,పూలను జోరుగా అమ్మారు. ప్రజలు పూజా సామగ్రి కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. బిల్వ, మాచీ, ఆచూత, మారేడు లాంటి 21 రకాల పత్రి, తామరాకులు, వెలగపండ్లు, మారెడు కాయలు, కంకులు, పెసరకాయ లాంటి వాటిని కొనుగోలు చేశారు. సోమవారం వినాయకచవితి పండుగను జరుపుకోనున్న నేపథ్యంలో విగ్రహల ప్రతిష్టకు మండపాలను ఏర్పాటు చేసి అందంగా అలంకరించారు. నవరాత్రోత్సవాలను వైభవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పూజ అలంకరణ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్‌ సందడిగా మారింది. వివిధ రూపాల్లో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మంచిర్యాల, జగిత్యాల, చంద్రపూర్‌, నాగపూర్‌ ప్రాంతాల నుంచి భారీ విగ్రహలను నిర్వహకులు తీసుకువచ్చారు. చిన్నచిన్న విగ్రహాలను చుట్టు పక్కల ప్రాంతాల గ్రామీణ ప్రజలు ఆసిఫాబాద్‌లో కొనుగోలు చేసి ప్రత్యేక వాహనాలలో గ్రామాలకు తరలిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మండలంలోని నజ్రూల్‌నగర్‌కు చెందిన పలువురు రైతులు గణేశ్‌ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పూజకు అవసరమయ్యే పువ్వులు, పత్రి, ఇతర సామగ్రిని తెచ్చి విక్రయించారు. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారంతా పండుగ కోసం కాగజ్‌నగర్‌కు వివిధ రైళ్లు, బస్సుల ద్వారా వచ్చారు. రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడువటంతో కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక బస్సుల్లో కూడా కిక్కిరిసిన జనంతో వచ్చారు. డీఎస్పీ వహిదుద్దీన్‌, సీఐ ప్రేంకుమార్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద పలు సూచనలు, సలహాలు చేశారు. హైదరాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైలులో కూడా పూర్తిగా రద్దీ నెలకొంది.

అధికారుల పర్యవేక్షణ..

జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా జిల్లా ఎస్పీ నితికా పంత్‌ ప్రత్యేక దృష్టిసారించారు. వినాయక ఉత్సవాల ప్రారంభం నుంచి చివరి వరకు పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నిర్వహకులతో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. సంప్రదాయ పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని నిర్వహకులను ఆదేశించారు. మండప నిర్వహకులు తప్పనిసరిగా తెలంగాణ పోలీసు పోర్టల్‌లో, సమీప పోలీసు స్టేషన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆదేశించారు. గణేశ్‌ మండపాల వద్ద డీజేలు అధిక శబ్దాలతో కూడిన సౌండ్‌ సిస్టంలకు అనుమతి లేదని సూచించారు.

Updated Date - Sep 13 , 2026 | 11:28 PM