ఆ ఊర్లో మందు.. గుట్కా నిషేధం!
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:40 AM
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మద్యం, గుట్కా తదితర మత్తు పదార్థాలను తరిమికొట్టాలని ఆ గ్రామం సంకల్పించింది.
మద్యం విక్రయిస్తే రూ.5లక్షలు, కొంటే 2లక్షల జరిమానా
వికారాబాద్ జిల్లా ధన్నారం గ్రామ ప్రజల తీర్మానం
వికారాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మద్యం, గుట్కా తదితర మత్తు పదార్థాలను తరిమికొట్టాలని ఆ గ్రామం సంకల్పించింది. వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని ధన్నారం గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని ఆదివారం అక్కడి ప్రజలు ఏక గ్రీవంగా తీర్మానించారు. సోమవారం నుంచి మద్యం, గుట్కా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించడం, కొనుగోలు చేయడం, సేవించడం పూర్తిగా నిషేఽధిస్తున్నట్లు ప్రకటించారు. నిషేఽఽధాన్ని ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు, కొనుగోలు చేస్తే రూ.2లక్షలు జరిమానా విధించనున్నారు. తీర్మానంపై యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు సంతకాలు చేశారు. మద్య నిషేధం అమలుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో 24 గంటల నిఘా కొనసాగనుంది.