గుట్టంతా సెల్‌ఫోన్‌లోనే!
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:53 AM
ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదని రైల్వే పోలీసులు స్పష్టం చేశారు.
పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయారెడ్డి కేసులో దర్యాప్తు అఽఽధికారుల వెల్లడి
కాల్‌డేటా వస్తేనే మిస్టరీ వీడే అవకాశం
ఆత్మహత్యకు ముందు గంటకు పైగా తమ్ముడితో మాట్లాడిన విజయారెడ్డి ?
ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు : పోలీసులు
హైదరాబాద్ సిటీ, బీబీనగర్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదని రైల్వే పోలీసులు స్పష్టం చేశారు. విజయారెడ్డి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నామని వస్తున్న వార్తలు అవాస్తవమని రైల్వే ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ తెలిపారు. విజయారెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌టా్‌పను పరిశోధనకు పంపామని, కాల్ రికార్డ్స్ డేటా వస్తేనే కేసు ఓ కొలిక్కివచ్చే అవకాశముందని చెప్పారు. హాస్టల్ వద్దకు వెళ్లి పిల్లలిద్దరినీ వెంట తెచ్చుకొని అర్థరాత్రి దాటేంత వరకు రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై నడుచుకుంటూ వెళ్లి పిల్లలను హత్తుకొని ఆత్మహత్య చేసుకునేంతకఠిన నిర్ణయం విజయారెడ్డి తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉండొచ్చన్నారు. అదేంటో త్వరలోనే తేలుస్తామని, అప్పటిదాకా అవాస్తవాలు ప్రచారం చేయొద్దని సూచించారు.
గంటకుపైగా తమ్ముడితో మాట్లాడిన విజయ..?
కాగా, జనవరి30వ తేదీ రాత్రి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న విజయారెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు తన సోదరుడితో సుమారు గంట సేపు ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. అయితే అక్కతో ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో రైళ్లు, రైల్వేస్టేషన్‌లోని ఇతర శబ్ధాలను ఆమె తమ్ముడు గమనించలేదా? ఆయనకు ఎలాంటి అనుమా నం కలగలేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే, తన చావుకు ఎవరూ కారణం కాదంటూ విజయారెడ్డి సూసైడ్ నోట్‌లో పేర్కొనడంతో ఆధారాలు లేకుండా ఎవరినీ అనుమానించలేమని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు చర్లపల్లి రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో విజయారెడ్డి పార్కు చేసిన కారును.. మంగళవారం ఆమె తమ్ముడికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నా యా? లేక విజయారెడ్దిని ఎవరి నుంచైనా బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్ గురిచేయడం చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, విజయారెడ్డి ఎందుకంత తీవ్ర నిర్ణయం తీసుకుందో తమకు అర్థం కావడం లేదని ఆమె భర్త సురేందర్ రెడ్డితోపాటు తల్లి, సోదరుడు చెబుతున్నారు. కానీ, విజయారెడ్డికి తల్లి, సోదరుడితో ఆర్థిక వివాదాలు ఉన్నాయని సురేందర్ రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు.