సచివాలయంలో విజిలెన్స్ తనిఖీ
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:30 AM
రాష్ట్ర సచివాలయ భవనాన్ని శనివారం విజిలెన్స్ బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. భవనం నిర్మాణం నాణ్యత సహా పలు అంశాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు.
నిర్మాణ నాణ్యత సహా పలు అంశాల పరిశీలన
ప్రత్యేక యంత్రాలతో పిల్లర్లు, స్లాబ్ బీమ్‌ల పరిశీలన
హైదరాబాద్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయ భవనాన్ని శనివారం విజిలెన్స్ బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. భవనం నిర్మాణం నాణ్యత సహా పలు అంశాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. భవనంలో కలియదిరిగి.. ఒక్కో చోట పిల్లర్లు, మరోచోట గోడలు, ఇంకోచోట స్లాబ్‌లతో పాటు వాటికి బలం కోసం పోసిన అడ్డబీమ్‌ల సామర్థ్యాలను ప్రత్యేక యంత్రాలతో పరిశీలించారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన అప్పటి బీఆర్‌ఎస్ పార్టీ కొత్త సచివాలయ భవన నిర్మాణం చేపట్టింది. అయితే సచివాలయ భవన నిర్మాణానికి చేసిన ఖర్చుతో పాటు ఐటీ పరికరాల కొనుగోళ్లలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. నిర్మాణ అంచనా మొదట రూ.617 కోట్లుగా పేర్కొనగా.. చివరకు అది కాస్త రూ.1,140 కోట్లకు చేరింది. దీనికి అదనంగా ఐటీ సామగ్రికి మొదట రూ.181 కోట్లుగా అంచనా వేయగా, అది కూడా మరో రూ.180 కోట్లు పెరిగి మొత్తం రూ.361 కోట్లకు చేరింది. వెరసి సచివాలయ భవనం, ఐటీ ఏర్పాట్లు అన్నిటికీ కలిపి వ్యయం దాదాపు రూ.1,501 కోట్లకు చేరిందని అఽధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికతో స్పష్టమైంది. ఈ అంశంపై ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అప్పట్లోనే పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ తరువాత 2023 డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే సచివాలయ భవనం నిర్మాణం, నాణ్యత ఇతర ఐటీ కొనుగోళ్లు కలిపి అన్ని అంశాలను తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత నుంచి విజిలెన్స్ విభాగం క్రమంగా సెక్రటేరియట్ బిల్డింగ్ సహా ఇతర అంశాలపై వివరాలను సేకరిస్తూ వస్తోంది. విజిలెన్స్ విచారణ దాదాపు చివరి దశకు చేరిందని, త్వరలోనే ప్రభుత్వానికి కీలక సమాచారంతో కూడిన ఒక నివేదికను సమర్పించనున్నట్టు తెలుస్తోంది.