PDS Rice Smuggling: విజిలెన్స్ దాడుల్లో.. ఖానాపూర్‌లో రూ.51 లక్షల పీడీఎస్ బియ్యం స్వాధీనం
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:09 AM
ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా నిరుపేదల పంపిణీ కోసం జారీ చేసిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి రీసైక్లింగ్ చేస్తున్న...
రీసైక్లింగ్ ముఠా అరెస్టు
జాతీయ రహదారిపై తనిఖీలు.. 7 లక్షల జరిమానా వసూలు
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా నిరుపేదల పంపిణీ కోసం జారీ చేసిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి రీసైక్లింగ్ చేస్తున్న ఒక ముఠాను రామచంద్రాపురం విజిలెన్స్ యూనిట్ అధికారులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామంలోని ఒక మూతపడిన రైసుమిల్లులో ఈ అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారుల బృందం గురువారం రాత్రి సోదాలు నిర్వహించి రూ.51 లక్షల విలువైన 900 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని, నిందితులను నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించి నిందితులపై నిత్యావసర వస్తువుల చట్టం సెక్షన్ 6ఏ కింద కేసు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు సూచించారు. విజిలెన్స్ విభాగం హైదరాబాద్ యూనిట్-2 అఽధికారులు గురువారం రాత్రి రాయకల్, రాజాపూర్ ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 9 వాహనాలను సీజ్ చేశారు. జీఎస్టీ ఉల్లంఘన, ఓవర్‌లోడ్, గనుల శాఖ రాయల్టీ ఎగవేత జరిగినట్లు గుర్తించి రూ.7 లక్షల జరిమానాను వసూలు చేశారు.