27 శాఖలతో విజిలెన్స్ పోర్టల్
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:40 AM
విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఇచ్చే నివేదికలపై ఆయా ప్రభుత్వ శాఖలు ఏం చర్యలు తీసుకున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు...
తీసుకున్న చర్యలపై నివేదికల అప్‌లోడ్ కోసమే
అక్రమార్కులు తప్పించుకోకుండా చూసేందుకే
విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ వెల్లడి
సోదాల సమయంలో సిబ్బంది ధరించేందుకు నూతన జాకెట్ల ఆవిష్కరణ.. పంపిణీ
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఇచ్చే నివేదికలపై ఆయా ప్రభుత్వ శాఖలు ఏం చర్యలు తీసుకున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను విజిలెన్స్ విభాగం ప్రారంభించింది. ఇందులో భాగంగా 27 ప్రభుత్వ శాఖలను ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారం మీదకు తీసుకొచ్చింది. విజిలెన్స్ విభాగం ఇచ్చే నివేదికలపై ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలు ఇన్నాళ్లు ఫైళ్ల రూపంలో అటు ఇటు తిరగడంతో.. అక్రమార్కులపై చర్యలు ఆలస్యమై అక్రమదందాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు యాక్షన్ టేకెన్ రిపోర్టులు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు. దీని ద్వారా విజిలెన్స్ నివేదికలకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు తక్షణ స్పందన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇదంతా పారదర్శకంగా ఉండటంతో అక్రమార్కులు తప్పించుకునే అవకాశం ఉండదని విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఇక క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ సిబ్బందికి గుర్తింపు తీసుకురావడమే కాకుండా.. దాడులు, సోదాల సమయంలో వారిని గుర్తించేలా రూపొందించిన నూతన జాకెట్లను ఆమె అవిష్కరించి, సిబ్బందికి పంపిణీ చేశారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై తవ్వకాలపై దాడులు..
మంజీరా నది సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఈ నెలలో జరిపిన దాడుల్లో 115 టన్నుల ఇసుకను, 9 వాహనాలను సీజ్ చేశామని, నలుగురిని అదుపులోకి తీసుకున్నామని విజిలెన్స్ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. అలాగే, ఓవర్ లోడింగ్, పన్ను ఎగవేతకు సంబంధించి 125వాహనాలను స్వాధీనం చేసుకున్నామనిచెప్పారు. రూ.1.06కోట్లవిలువైన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్ రీజయన్ పరిధిలో 25 ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి పలు అక్రమాలను గుర్తించామని విజిలెన్స్ విభాగం డైరక్టర్ అభిషేక్ మహంతి తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సంబంధించి గత ఏడాది అక్టోబరు నుంచి నేటి వరకు రూ.256కోట్ల అక్రమాలను గుర్తించగా రూ.62కోట్లు వసూలు చేశామని, ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి 26ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చే శామని వెల్లడించారు.