Share News

అక్రమ చేపల చెరువులపై విజిలెన్స్‌ దాడులు

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:26 AM

మంజీరా నది చుట్టుపక్కల అక్రమంగా ఏర్పాటు చేసిన చేపల చెరువులపై నివేదిక సమర్పించాలని అందోల్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

అక్రమ చేపల చెరువులపై విజిలెన్స్‌ దాడులు

  • మంజీరా నది పరీవాహక ప్రాంతంలో ట్రాన్స్‌కో, విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

  • విద్యుత్‌ కనెక్షన్లు కట్‌.. పదిమందిపై కేసులు

  • తీవ్రంగా పరిగణిస్తున్నాం: మంత్రి దామోదర

  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అక్రమార్కుల పరార్‌

  • ఇప్పటికీ పట్టించుకోని నీటిపారుదల శాఖ

సంగారెడ్డి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మంజీరా నది చుట్టుపక్కల అక్రమంగా ఏర్పాటు చేసిన చేపల చెరువులపై నివేదిక సమర్పించాలని అందోల్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంజీర జలాల నాణ్యతపై ఎలాంటి అనుమానాలూ తలెత్తకుండా నీటి నమూనాలను సేకరించి పరీక్షించాలని చించారు. ప్రజారోగ్యం, తాగునీటి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యానికి, తాగునీటి భద్రతకు ముప్పు కలిగించే పరిస్థితులు ఉన్నట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, నివారణ చర్యలు కూడా చేపడతామని చెప్పారు. మంజీర జలాలలపై ఆధారపడే పారంతాల ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. మంజీరానది చుట్టుపక్కల అక్రమంగా చేపల చెరువులను ఏర్పాటుచేసి.. చికెన్‌ వ్యర్థాలు, కుళ్లినగుడ్లతో నదీజలాలను కలుషితం చేస్తున్న దందాపై ’జీవ జలమా.. చేదు విషమా’ అనే శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. నది పరీవాహక ప్రాంతాల్లో ఈ కథనం చర్చనీయాంశం కాగా.. తమ దందా బయటపడడంతో అక్రమంగా అక్కడ చేపల చెరువులు ఏర్పాటుచేసినవారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కథనంతో అప్రమత్తమైన ట్రాన్స్‌కో, విజిలెన్స్‌ అధికారులు.. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం నీర్జప్ల, భూత్కూర్‌, దేవనూర్‌, ఖాదిరాబాద్‌ తదితర గ్రామాల్లోని అక్రమ చేపల చెరువులను పరిశీలించారు. వాటికోసం వినియోగిస్తున్న విద్యుత్‌ లైన్లను తొలగించారు. పది మంది చేపల చెరువుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.


నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం..

మంజీరా నది, సింగూరు రిజర్వాయర్‌ ప్రాంతమంతా నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తుంది. చేపల చెరువులు ఏర్పాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. కానీ.. వందకుపైగా చెరువులు తవ్వినా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడి అక్రమ దందా జోరుగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఆ దందాపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైనప్పటికీ.. ఆ శాఖ అధికారులు చేపల చెరువుల వైపు వెళ్లకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఓ పక్క విజిలెన్స్‌ అధికారులు ఏకధాటిగా దాడులు చేస్తుంటే.. వీరు మాత్రం కిమ్మనలేదని, చెరువులను తొలగించడం అటుంచి.. కనీసం మంజీర నది నుండి చెరువుల్లోకి వేసిన పైపులను సైతం తొలగించకపోవడం గమనార్హమని పేర్కొంటున్నారు. కాగా.. జేసీబీలు తెచ్చి చెరువులను కూల్చడం ఖర్చుతో కూడుకున్న పని అని, త్వరలోనే తొలగిస్తామని సింగూరు రిజర్వాయర్‌ను పర్యవేక్షించే డీఈ నాగరాజు చెప్పారు. దీనిపై సమగ్రనివేదికను తయారుచేస్తున్నామని, చెరువులను వెంటనే తొలగిస్తామని ఆ శాఖ ఈఈ భీమ్‌ వివరణ ఇచ్చారు.

అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

మంజీర నది, సింగూరు రిజర్వాయర్‌ పరిసరాల్లో అక్రమంగా చేపల చెరువులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. వీరికి మంత్రి దామోదర రాజనర్సింహ అండదండలున్నాయి. ఈ దందాలో మంత్రి బావమరిది, పీఏలు, అనుచరులు ఉన్నారు. చేపల చెరువులను ప్రోత్సహిస్తూ.. మంజీర నీటిని కలుషితం చేస్తున్నారు. ఆ చెరువులను ధ్వంసం చేసి, అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలి. ’

- ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే, క్రాంతికిరణ్‌

Updated Date - Jun 13 , 2026 | 06:27 AM