సంగారెడ్డిలో వైభవంగా సీతారాముల కల్యాణం
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:30 AM
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సంగారెడ్డిలోని రామ్‌నగర్ రామ్‌మందిర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది.
2.250 కిలోల బంగారు ఆభరణాలతో దేవేరుల అలంకరణ
10 కిలోల వెండితో ఆదిశేషు కల్యాణ పీటను చేయించిన జగ్గారెడ్డి
వేడుకలో 3 క్వింటాళ్ల మేలిమి ముత్యాల తలంబ్రాలు సమర్పణ
కిక్కిరిసిన సంగారెడ్డి రామ్‌మందిర్
సంగారెడ్డి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సంగారెడ్డిలోని రామ్‌నగర్ రామ్‌మందిర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఈ కల్యాణ వేడుకను వైభవంగా జరిపించారు. కల్యాణ మహోత్సవంలో సీతారాములకు 3 క్వింటాళ్ల మేలిమి ముత్యాల తలంబ్రాలను సమర్పించి, అనంతరం వాటిని భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల, జిల్లా జడ్జి భవానీచంద్ర, జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి, కొడుకు భరత్‌సాయిరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
స్వామివారికి జగ్గారెడ్డి సమర్పించిన కానుకలివే..
సీతారామచంద్ర స్వాములకు జగ్గారెడ్డి 2 కిలోల 250 గ్రాముల బంగారంతో కర్ణాభరణాలతో కూడిన కిరీటాలు, కంఠాభరణాలు, వడ్డాణాలు, పద్మపాదాలు, ధనుస్సు, బాణం, యజ్ఞోపవీతం, నయనాలు, తిలకాలు, ముక్కుపోగు, శంకుచక్రాలు, అమ్మవారికి మంగళసూత్రం, కమలహస్తం, రాములవారికి శరంతోకూడిన హస్తంతోపాటు 10 కిలోల వెండితో ఆదిశేషుడు, కల్యాణ పీటను సమర్పించారు. అంతకుముందు తన నివాసంలో జగ్గారెడ్డి ఈ ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.