Share News

అభ్యుదయ రచయిత ఏటుకూరి కన్నుమూత

ABN , Publish Date - May 25 , 2026 | 05:13 AM

విశాలాంధ్ర, నవ చేతన ప్రచురణ సంస్థల సంపాదకుడు, సాహితీవేత్త ఏటుకూరి బాల శంకర ప్రసాదరావు(90) ఇకలేరు. శనివారం రాత్రి హిమాయత్‌ నగర్‌ లోని...

అభ్యుదయ రచయిత ఏటుకూరి కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, మే25(ఆంధ్రజ్యోతి): విశాలాంధ్ర, నవ చేతన ప్రచురణ సంస్థల సంపాదకుడు, సాహితీవేత్త ఏటుకూరి బాల శంకర ప్రసాదరావు(90) ఇకలేరు. శనివారం రాత్రి హిమాయత్‌ నగర్‌ లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరులో జన్మించిన ఆయన ఉమ్మడి భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి, యువజన సంఘాల్లో చురుగ్గా పని చేశారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర, జాతీయ కార్యదర్శి హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. 4 దశాబ్దాలు విశాలాంధ్ర పబ్లికేషన్స్‌కు, దశాబ్ద కాలం నుంచి నవ చేతన ప్రచురణ సంస్థకు సంపాదకుడిగా ేసవలందించారు. ప్రసాద్‌ సంపాదకత్వంలో నూరేళ్ళ తెలుగు కథ, తెలంగాణ కథ, నూరేళ్ళ కన్యాశుల్కం వంటి పలు అమూల్యమైన సంకలనాలు వెలువడ్డాయి. తెలుగు సాహిత్య రంగంలో 1862 నుంచి 1962 మధ్య కాలంలోని 100మంది ప్రసిద్థ కవుల చేతి రాత కవిత్వాన్ని సేకరించి ‘‘పొయిట్రీ వర్క్‌ షాప్‌’’ పుస్తకంగా ప్రచురించారు. ఎర్ర జెండా పాటలు, ఎర్ర బాట పాటలు వంటి ప్రజా ఉద్యమాలకు ప్రేరణగా నిలిచే గేయాలతో పాటు ఆరని జ్వాల, శివాలయ్య నృత్యరూపకాలు, పలు వ్యాసాలు రాశారు. పలువురు ప్రముఖులు, నాయకులు ఏటుకూరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆదివారం తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రసాద్‌ కుమారుడు అరుణ్‌ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 05:13 AM