Share News

వేప పువ్వే కరువాయె!

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:23 AM

ఉగాది పర్వదినాన అత్యంత కీలకమైన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిలో ఒక రుచికి కరువు ఏర్పడింది. చేదుకు ప్రతీకగా నిలిచే వేప పువ్వు దొరకటం లేదు.

వేప పువ్వే కరువాయె!

  • ఉగాది వేళ మార్కెట్‌లో కొరత

  • వేపకు ప్రత్యామ్నాయంగా తులసి ఉత్తమమని పురోహితుల వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఉగాది పర్వదినాన అత్యంత కీలకమైన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిలో ఒక రుచికి కరువు ఏర్పడింది. చేదుకు ప్రతీకగా నిలిచే వేప పువ్వు దొరకటం లేదు. వేపచెట్లను విచ్చలవిడిగా నరికివేయడంతో పాటు, కొద్ది సంవత్సరాలుగా తెగుళ్లు విజృంభించడంతో ఈ ఏడాది వేపపువ్వుకు కరువొచ్చింది. ఫంగస్‌ కారణంగా వేపచెట్లు వేగంగా తరిగిపోతున్నాయని పర్యావరణ పరిరక్షణ కోసం కృషిచేస్తోన్న ఓ ఎన్జీవోలో పనిచేస్తున్న క్రిష్‌ తెలిపారు. హైదరాబాద్‌లో వేప పువ్వు కొరత తీవ్రంగా ఉంది. మామిడి ఆకులు, కాయలు అమ్ముతున్న వారిలో చాలామంది వేప పువ్వు దొరకడం లేదని చెబుతున్నారు. కొంతమంది మాత్రం తాము పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా నుంచి తెచ్చామని, హైదరాబాద్‌లో ఎక్కడా దొరకడం లేదని తెలిపారు. కొరత కారణంగా చిన్న వేప రెమ్మకే రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు 15 గ్రాముల వేప ఆకు, పువ్వును రూ.25లకు విక్రయిస్తే, మరికొన్ని సంస్థలు 20 గ్రాములకు రూ.30 వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని ఆన్‌లైన్‌ సంస్థల్లో నో స్టాక్‌ అని చూపిస్తోంది. దీంతో కొందరు వేప పువ్వుకు ప్రత్యామ్నాయంగా ఏం వాడొచ్చని పురోహితులను సంప్రదిస్తున్నారు. కానీ, ఉగాది పచ్చడిలోకి వేప పువ్వుకు ప్రత్యామ్నాయాన్ని మన పూర్వీకులు సూచించలేదని మోతీనగర్‌లోని ఓ దేవాలయ పూజారి రాజేష్‌ శర్మ తెలిపారు. అయితే, వేప పువ్వుకు ప్రత్యామ్నాయంగా తులసిని వాడుకోవటం ఉత్తమమని చెప్పారు.

Updated Date - Mar 19 , 2026 | 04:23 AM