Share News

మీడియా సంస్థల నిర్వహణలో రాజకీయ జోక్యం తగదు

ABN , Publish Date - May 29 , 2026 | 03:45 AM

మీడియా సంస్థల నిర్వహణలో రాజకీయ పార్టీలు, నాయకుల జోక్యం లేనప్పుడే ఆయా సంస్థలు తమ విధి నిర్వహణలో విద్యుక్త ధర్మాన్ని పాటించగలవని భారత ....

మీడియా సంస్థల నిర్వహణలో రాజకీయ జోక్యం తగదు

  • పాత్రికేయ విలువలు క్షీణిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం

  • సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంత్యుత్సవంలో వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌ సిటీ, మే 28 (ఆంధ్రజ్యోతి): మీడియా సంస్థల నిర్వహణలో రాజకీయ పార్టీలు, నాయకుల జోక్యం లేనప్పుడే ఆయా సంస్థలు తమ విధి నిర్వహణలో విద్యుక్త ధర్మాన్ని పాటించగలవని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. పాత్రికేయ విలువలు క్షీణిస్తే ప్రజాస్వామ్య పునాదులే బలహీనపడతాయని ఆయన హెచ్చరించారు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వేదికగా జరిగిన సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంత్యుతవానికి ముఖ్యఅఽతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డికి సురవరం ప్రతాపరెడ్డి స్మారక సాహిత్య పురస్కారాన్ని ఆయన చేతుల మీదుగా ప్రదానం చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కందుకూరి, గురజాడ తర్వాత తెలుగు జాతిని అత్యంత ప్రభావితం చేసిన మహనీయుల వరుసలో సురవరం ప్రతాపరెడ్డి ప్రముఖంగా నిలుస్తారని కొనియాడారు. తెలంగాణలో ‘‘కవులే లే రు’’ అనే నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని ‘గోల్కొండ కవుల సంచిక’ ద్వారా దీటైన సమాధానమిచ్చిన ధీశాలి సురవరమని అన్నారు. అంతటి గొప్పవ్యక్తి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే మరింత సముచితంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. గోల్కొండ పత్రిక నిర్వాహకుడిగా సురవరం నిర్వహించిన పాత్రను ప్రస్తుతిస్తూ.. ఈనాటి కొన్ని మీడియా సంస్థల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అడ్డువస్తున్నాయని భావించే పత్రికలు, టీవీ ఛానళ్ల మూలాలు కొంతమంది నాశనం చేసే ప్రయత్నాలు చేయడం సరికాదని హితవు పలికారు. వ్యవసాయ రంగానికి, మాతృభాష పరిరక్షణకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

Updated Date - May 29 , 2026 | 03:45 AM