‘పదవీ విరమణ చేశా.. పెదవి విరమణ చేయలేదు’
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:09 AM
నేను పదవీ విరమణ మాత్రమే చేశాను.. పెదవి విరమణ చేయలేదు’’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సూర్యాపేట ...
మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
కోదాడ టౌన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను పదవీ విరమణ మాత్రమే చేశాను.. పెదవి విరమణ చేయలేదు’’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సమాజహితమే నిజమైన పుణ్యమని, తనకున్న జ్ఞానాన్ని యువతకు పంచేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే భావనతో సమాజం వసుధైక కుటుంబంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కులం అందరికీ ఉంటుందని, కులపిచ్చి మాత్రం ఉండకూడదని స్పష్టం చేశారు.
సామాజిక సేవలో ఆదర్శంగా నిలవాలి: మంత్రి తుమ్మల
కాకతీయ కమ్మ సేవాసమితి సామాజిక సేవలో ఆదర్శంగా నిలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సమాజ అభివృద్ధికి సేవా సంస్థలు కీలకపాత్ర పోషించాలని, పేద, బలహీన వర్గాలకు అండగా నిలవాలని సూచించారు. సేవా కార్యక్రమాలు, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు.