Venkaiah Naidu: రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని సమర్థించను
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:16 AM
రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని తాను సమర్థించనని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
సేవా మార్గమే అసలైన వారసత్వం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో సంక్రాంతి సందడి
శంషాబాద్ రూరల్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని తాను సమర్థించనని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సమాజానికి సేవ చేయాలనే ధృక్పథమే తాను విశ్వసించే అసలైన వారసత్వమని అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఆదివారం ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రాంగణంలో నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రాసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలతో కలిసి వెంకయ్య ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలన్న సంకల్పంతో 25ఏళ్ల క్రితం ప్రారంభించిన స్వర్ణభారత్ ట్రస్ట్‌ను.. తన కుమార్తె దీపావెంకట్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. సంక్రాంతి అచ్చంగా రైతుల పండగ అని, మన దగ్గరున్న దానిని నలుగురితో పంచుకోవడమే పండగలోని అసలైన పరమార్థమని అన్నారు. తెలుగు రాష్ట్రాలు తమ పాలన వ్యవహారాలను తెలుగులో కొనసాగించాలని సూచించారు. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులకు సూచించారు.
తండ్రికి తగ్గ తనయ
స్వర్ణభారతి ట్రస్ట్‌ను సమర్థంగా నడిపిస్తూ, దీపావెంకట్ తండ్రికి తగ్గ తనయు అని నిరూపించుకున్నారని, ఆమె నాయకత్వంలో ట్రస్ట్ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగిన వెంకయ్యనాయుడు జీవితం అందరికి ఆదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మల్లేపల్లి మోహన్ స్వరకల్పన చేసిన అలపించిన వేమన పద్యాల సీడీని వెంకయ్యనాయుడు అవిష్కరించారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ, ట్రస్ట్ చైర్మన్ దీపావెంకట్, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, నటుడు బ్రహ్మానందం, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.