ఉచితాలు వద్దు!
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:50 AM
రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై హామీలు ఇచ్చే బదులు పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హితవు పలికారు.
నాణ్యమైన విద్య, వైద్యం అందించండి
ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేనివారు ఉచిత హామీలు ఇవ్వటం ఎందుకు?
పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే నేతలు ఇంకో పార్టీలోకి మారాలి
మూడోసారీ బీజేపీ ఓడితే కష్టమని.. నాడు మోదీ నాయకత్వాన్ని బలపరిచాం: వెంకయ్య నాయుడు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు భాష మీద నియంత్రణ లేదు: కిషన్‌రెడ్డి
‘వెంకయ్య ‘నాయకుడు’ పుస్తకావిష్కరణ.. పాల్గొన్న పలువురు ప్రముఖులు, నేతలు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై హామీలు ఇచ్చే బదులు పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హితవు పలికారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేనివారు, నిధుల కోసం కేంద్రంపై ఆధారపడినవారు ఉచితాలపై హామీలు ఇవ్వడం సరికాదన్నారు. ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితిలో ఉంటే.. మహిళలకు ఉచిత బస్సు హామీని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ప్రజలు ఉచితాలు కోరుకోవడం లేదని చెప్పారు. సీనియర్ పాత్రికేయుడు మాశర్మ రచించిన ‘వెంకయ్య ‘నాయకుడు’ పుస్తకావిష్కరణ సభ మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తాము ఇచ్చే ఉచిత హామీల అమలుకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో స్పష్టత ఇచ్చిన తర్వాతే వాటిని పార్టీలు ప్రకటించాలన్నారు. ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులను ప్రస్తావిస్తూ.. వాటి నిరోధానికి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని.. కానీ, స్పీకర్‌కు సమర్పించిన పిటిషన్‌లు పెండింగులో ఉంటున్నాయని గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యే తాను ఏ పార్టీ గుర్తుపై గెలిచారో, ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతగానీ మరో పార్టీలో చేరొద్దని, అప్పుడే దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అయితే, కొన్ని విషయాల్లో అతిగా మాట్లాడుతున్నారని వెంకయ్య వ్యాఖ్యానించారు.
యువ నాయకత్వంతో విజయం
‘2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయాం. మూడోసారి కూడా ఓడితే పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని భావించాం. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించి.. నాటి గుజరాత్ సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని 2014 ఎన్నికల్లో బలపరిచాం. అందుకే బీజేపీ గెలిచింది’ అని వెంకయ్య నాయుడు వివరించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ.. ‘రూపాయి ఖర్చు పెట్టకుండా రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ఉదయగిరి ప్రజలను మరచిపోను. నన్ను ఓడించిన ఆత్మకూరు ప్రజలనూ మరచిపోను. ఆనాడు గెలిచి ఉంటే సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగేవాడిని. వారు ఓడించారు కాబట్టే ఢిల్లీ వరకూ వెళ్లగలిగాను’ అని వెంకయ్య పేర్కొన్నారు.
వెంకయ్య నుంచే సంస్కారం నేర్చుకున్నా: కిషన్‌రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నాయకులకు భాష మీద నియంత్రణ లేకుండా పోయిందని, అందువల్లే తెలుగు ప్రజలకు రాజకీయాల మీద గౌరవం తగ్గిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తులు.. వెంకయ్యనాయుడు ఉపన్యాసాలను, చట్టసభల్లో ఆయన వ్యవహరించిన తీరును అధ్యయనం చేయాలని సూచించారు. ‘రాజకీయాల్లో 40 ఏళ్లుగా నన్ను నడిపిస్తున్న గురువు, మార్గదర్శి వెంకయ్యనాయుడు. నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానకారణం వెంకయ్య, దత్తన్న, ఇంద్రసేనారెడ్డి. వెంకయ్య శిష్యుడిని కనుకే సంయమనం కోల్పోయి వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు నేను ఎన్నడూ దిగలేదు. ఈ సంస్కారాన్ని నేను ఆయన నుంచే నేర్చుకున్నా’నని తెలిపారు. కాగా ‘వెంకయ్య నాయకుడు’ పుస్తకాన్ని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, కేంద్రసహాయ మంత్రి శ్రీనివాస వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సుజనా చౌదరి, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ శ్రీభరత్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.