యువత వాజ్ పేయిని స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:45 AM
యువత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని...
కుల, విలువల్లేని రాజకీయాలను మార్చాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఖమ్మం కలెక్టరేట్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): యువత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, మహనీయుల జీవితాలను అధ్యయ నం చేసి కుల, విలువల్లేని రాజకీయాలను సమూలంగా మార్చివేయాలని పిలుపునిచ్చారు. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ‘అటల్‌జీకి అక్షర నీరాజనం’ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. వాజ్‌పేయి గొప్ప దేశభక్తుడని, పదవుల కోసం, పీఠాల కోసం ఆయన ఎప్పుడూ రాజీపడలేదని అన్నారు. ఓటమిని సైతం అత్యంత హుందాగా స్వీకరించిన గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతమని కొనియాడారు. ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని వదులుకొని ప్రజాస్వామ్యయుతంగా మళ్లీ గెలిచి ప్రధాని పదవిని చేపట్టారని తెలిపారు. ప్రపంచ దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా రాజీలేని ధోరణితో పోఖ్రా న్ అణు పరీక్షలు నిర్వహించిన ధీశాలి అని కొనియాడారు. ప్రస్తుత రాజకీయాలు మారాలని.. కులం, మతం, ధనం ఆధారంగా కాకుండా నాయకుడి వ్యక్తిత్వం, సామర్థ్యం, యోగ్యత, ప్రవర్తన చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. నేటి రాజకీయాలు హీనస్థితికి చేరుకున్నాయన్నారు. ఆరోగ్యకరమైన విమర్శలకు బదులుగా నాయకులు బూతులు మాట్లాడుతున్నారని, తెలంగాణలో ఈ బూతుల సంస్కృతి పోవాలని ఆయన అన్నారు.