Share News

వేములవాడ దర్గాపై ఎల్లుండి వరకు చర్యలు తీసుకోం

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:30 AM

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దర్గాపై సోమవారం వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని దేవాదాయశాఖ హైకోర్టుకు తెలిపింది.

వేములవాడ దర్గాపై ఎల్లుండి వరకు చర్యలు తీసుకోం

  • హైకోర్టుకు తెలిపిన దేవాదాయశాఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దర్గాపై సోమవారం వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని దేవాదాయశాఖ హైకోర్టుకు తెలిపింది. గత ఎనిమిది వందల సంవత్సరాలుగా మతసామరస్యానికి ప్రతీకగా ఉంటున్న ఈ దర్గాను అక్కడి నుంచి తరలించడానికి అధికారులు యత్నిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై శుక్రవారం జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 12వ శతాబ్దం నుంచి వేములవాడ ఆలయంలో దర్గా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ దర్గాను అక్కడి నుంచి తరలించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే దర్గా వద్దకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టారని పేర్కొన్నారు. దర్గాను తరలించకుండా ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. దర్గా తరలింపునకు అనుమతి ఇచ్చే అధికారం ముతవల్లికి లేదని, ఆ అధికారం వక్ఫ్‌బోర్డుకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. దేవాదాయశాఖ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారుల నుంచి సూచనలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. మార్చి 2 వరకు దర్గాకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Updated Date - Feb 28 , 2026 | 03:30 AM