Share News

వేములకొండ.. కన్నీటి సంద్రం

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:28 AM

భర్త వేధింపులు తాళలేక తన ఇద్దరు పిల్లల్ని చంపి, ఆత్మహత్య చేసుకున్న ఐశ్వర్యకు కుటుంబసభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు.

వేములకొండ.. కన్నీటి సంద్రం

తల్లీబిడ్డలకు అంతిమ వీడ్కోలు

భారీగా హాజరైన ప్రజలు

వలిగొండ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): భర్త వేధింపులు తాళలేక తన ఇద్దరు పిల్లల్ని చంపి, ఆత్మహత్య చేసుకున్న ఐశ్వర్యకు కుటుంబసభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఐశ్వర్య కోరిక మేరకు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండలోని రేగుచెట్టు కింద ఐశ్వర్య, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఖననం చేశారు. బీబీనగర్‌ మండలం గొల్లగూ డెంలో భర్త మేకల మహేష్‌, అత్తింటి వేధింపులు తాళలేక ఐశ్వర్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి స్వగ్రామం వేములకొండకు తరలించారు. ఐశ్వర్య, ఆమె కుమార్తె ఝాన్సీ, కుమారుడు పండు మృతదేహాలను ట్రాక్టర్‌పై ఉంచి గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు. బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

రేగుచెట్టు కిందనే ఖననం

సూసైడ్‌ నోట్‌లో ఐశ్వర్య రాసినట్టుగానే ఆమె తండ్రి వ్యవసాయ పొలం వద్ద ఉన్న రేగు చెట్టు కిందనే ఐశ్వర్యతోపాటు పిల్లలను ఖననం చేశారు. ఐశ్వర్య తండ్రి యాదయ్య ముందు నడిచి అంతిమ సంస్కారంచేశారు. కట్టుకున్న భార్య, కన్నబిడ్డల మీద మమకారం లేని మేకల మహే్‌షలాంటి భర్త ఎవరికి ఉండకూడదని, అనుమానం అనే భూతానికి తమ గ్రామ ఆడబిడ్డ బలైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ఐశ్వర్య అంత్యక్రియలకు డీసీసీ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి, మాజీ ఎంపీటీసీ సామ రాంరెడ్డి, మండల కోఆప్షన్‌ మాజీ సభ్యుడు ఎస్‌కె. రసూల్‌, నాయకులు పులిపల్పుల రాములు తదితరులు హాజరై మృతదేహాలపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని ఓదార్చారు.

Updated Date - Mar 05 , 2026 | 12:28 AM